Cyclone Fengal Effect : ఫెంగల్ తుపానుపై చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
Cyclone Fengal Effect : ఫెంగల్ తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా.. సీఎం చంద్రబాబు తుపానుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టలు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
ఫెంగల్ తుపానుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి.. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి.. పూర్తి సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం.. రైతులకు నిర్దిష్టమైన సమాచారాన్ని చేరవేయాలని అధికారులను ఆదేశించారు.
'ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలి. తుపాను కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయనే సమాచారం నేపథ్యంలో.. ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలి. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందునుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయాత్తం కావాలి. తుపానుపై రైతులు ఆందోళనగా ఉన్నారు. నిర్ధిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలి' అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
తిరుపతి జిల్లాపై..
తిరుపతి జిల్లాపై ఫెంగల్ తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. శుక్రవారం రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే 4 విమాన సర్వీసులను రద్దు చేశారు. హైదరాబాద్, విశాఖ, బెంగళూరు వెళ్లాల్సిన విమానాలను ఇండిగో ఎయిర్ లైన్స్ రద్దు చేసింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా ఏర్పేడు మండలంలో సీత కాలువ పొంగిపొర్లుతుంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
తీరం దాటే అవకాశం..
గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుపాన్ కదులుతుంది. బంగాళాఖాతంలో పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతున్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 150 కిలోమీటర్లు, చెన్నైకి 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. శనివారం సాయంత్రానికి ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉంది.
ఈ జిల్లాలపై ప్రభావం..
ఈ తుపాను ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం తీరం వెంబడి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని స్పష్టం చేసింది.