CBN Press Meet : విశాఖలో ఐటీ గేమ్ ఛేంజర్‌గా మారబోతోంది.. దావోస్ పర్యటన విశేషాలను వెల్లడించిన చంద్రబాబు-cm chandrababu reveals details of davos tour ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn Press Meet : విశాఖలో ఐటీ గేమ్ ఛేంజర్‌గా మారబోతోంది.. దావోస్ పర్యటన విశేషాలను వెల్లడించిన చంద్రబాబు

CBN Press Meet : విశాఖలో ఐటీ గేమ్ ఛేంజర్‌గా మారబోతోంది.. దావోస్ పర్యటన విశేషాలను వెల్లడించిన చంద్రబాబు

Basani Shiva Kumar HT Telugu
Jan 25, 2025 01:46 PM IST

CBN Press Meet : దావోస్‌కు వెళ్లి వచ్చాక అక్కడి అంశాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని.. సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 1995లో ఐటీ రంగం, 2025లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కీలక రంగాలుగా మారాయని వివరించారు. ధ్వంసం అయిన ఏపీ బ్రాండ్‌ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నానని చెప్పారు.

చంద్రబాబు
చంద్రబాబు

దావోస్ పర్యటన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 1995 నుంచి దావోస్‌కు వెళ్లడం ప్రారంభించానని చెప్పారు. మొదట్లో ఏ హైదరాబాద్ అని అడిగారని.. బిల్‌గేట్స్ కూడా ఏపీ కోసం ప్రమోట్ చేస్తున్నారా అని అడిగారని వివరించారు. ముఖ్యమంత్రులుగా తన తరువాత కర్ణాటక నుంచి ఎస్ఎం కృష్ణ వచ్చారన్న చంద్రబాబు.. ధ్వంసం అయిన ఏపీ బ్రాండ్‌ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నానని వ్యాఖ్యానించారు.

yearly horoscope entry point

27 సమావేశాల్లో..

'దావొస్‌లో మొత్తం 27 సమావేశాల్లో పాల్గొన్నాను. కంట్రీ స్ట్రాటజిక్ డయలాగ్ అనే అంశంపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాల్గొన్నాం. గ్రీన్ ఎనర్జీ - గ్రీన్ హైడ్రోజన్ మాన్యుఫాక్చరింగ్ అనే అంశంపై సదస్సు జరిగింది. ఏపీ పెట్రో కెమికల్ హబ్, బ్లూ ఓషన్ ఎకానమీ అనే అంశాల గురించి విస్తృతంగా చర్చించాం. సుస్తిరాభివృద్ది, లక్ష్యాల సాధన, ప్రకృతి వ్యవసాయంపై చర్చించాం. లోకేష్ 35 సమావేశాలు, 5 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు' అని చంద్రబాబు వివరించారు.

బ్రాండ్ ఏపీ ప్రమోట్..

'మొత్తం మీద ఏపీనీ మళ్లీ ప్రపంచ పటంపైన పెట్టడం మా లక్ష్యం. 1995లో ఐటీ రంగం, ఇప్పుడు 2025లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కీలక రంగాలుగా మారాయి. గతంలో నైపుణ్యం కోసం ఐటీతోపాటు ఇంగ్లీష్ కూడా నేర్పించాం. మన వాళ్లు ఉద్యోగాలు పొందటం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు మన వాళ్లు 25 శాతం మేర యూరప్‌లో ఉన్నారు' అని చంద్రబాబు వెల్లడించారు.

అప్పటి విజన్ కారణంగానే..

'ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాల్లో తెలుగువారు ఉన్నారు. అప్పుడు చేసిన విజన్ కారణం గానే ఇది సాధ్యమైంది. భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. పరిశ్రమల సహకారం కూడా తీసుకుంటాం. 2047 నాటికి అత్యంత ప్రభావితమైన వ్యక్తులుగా తెలుగు వారు ఉంటారు. అమరావతి తోపాటు ఇతర ప్రాంతాలు, దేశాల్లో కూడా గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం' అని చంద్రబాబు వివరించారు.

ఆ స్థాయికి ఏపీ..

'వచ్చే కాలానికి ప్రపంచానికి అన్ని సేవలు ఇవ్వగలిగే స్థాయికి ఏపీ వస్తుందని ఊహిస్తున్నా. దావోస్ వెళ్లి ఎన్ని డబ్బులు తెచ్చారు, ఎన్ని ఒప్పందాలు చేసుకున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. దావోస్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ కంపెనీలు, వివిధ దేశాల ప్రతినిధులు వచ్చే ఓ సమావేశ కేంద్రం. మూడు రోజుల్లో అందరినీ ఒకే చోట కలిసే అవకాశం ఉంది. ప్రపంచంలో వచ్చే ఆధునిక ఆలోచనలు, ట్రెండ్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా నెట్వర్కింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

పోర్టుల వినియోగంపైనా..

'ఈసారి గ్రీన్ ఎనర్జీ - గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేవి కీలక మైన అంశాలుగా మారాయి. ఏపీలో 10 పోర్టులు ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకూ మనం సక్రమంగా వినియోగించుకోలేక పోతున్నాం. మన వద్ద ఉన్న వనరులు, ఉత్పత్తులను సరిగ్గా ఇతర ప్రాంతాలకు, దేశాలకు ఎగుమతి చేయలేక పోతున్నాం. కొన్ని చిన్న దేశాలు చక్కగా వాటిని వర్గీకరించి.. పోర్టుల ద్వారా ఎగుమతి చేస్తున్నాయి' అని చంద్రబాబు వివరించారు.

గ్రీన్ ఎనర్జీకి అవకాశాలు..

'ఇపుడు ప్రపంచ ఆర్థిక ఫోరం గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేస్తోంది. అమరావతి తోపాటు రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి ఉన్న అవకాశాలు వివరించాం. సమీప కాలంలోనే భారత్‌కు ప్రపంచ వ్యాప్తంగా స్వర్ణయుగం రాబోతోంది. యువ భారత్ అనేది మనకు ఉన్న అద్భుతమైన అవకాశం. జీడీపీ వృద్ధి రేటులో కూడా సుదీర్ఘ కాలం భారత్ అగ్రస్థానంలో ఉండబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ యాక్సెప్టబుల్ పర్శన్స్ ఇండియన్స్' అని చంద్రబాబు స్పష్టం చేశారు.

కొత్త స్టీల్ ప్లాంట్..

'రామాయపట్నంలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ బీపీసీఎల్ ఏర్పాటు చేయబోతోంది. రూ.96 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. రూ.1.35 లక్షల కోట్లతో అనకాపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్ వస్తోంది. రూ.1.87 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతోంది. గ్రీన్ అమ్మోనియా కూడా కాకినాడ నుంచి ఎగుమతి చేయబోతున్నాం. రూ.10 లక్షల కోట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కి పెట్టుబడులు వస్తున్నాయి' అని సీఎం వెల్లడించారు.

గేమ్ ఛేంజర్‌గా విశాఖ..

'విశాఖలో ఐటీ ఒక గేమ్ ఛేంజర్‌గా మారబోతోంది. టీసీఎస్ కూడా అక్కడ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. భవిష్యత్ అంతా పర్యాటకానిదే. టాటా గ్రూప్ 200 వరకూ గదులు నిర్మించేందుకు ముందుకు వచ్చింది. అమరావతిలో పనులు ప్రారంభం కానున్నాయి. విద్య, వైద్యం, ఇన్‌ఫ్రా రంగాలు కీలకంగా మారనున్నాయి. పోలవరంలో కూడా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పనులు ఊపందుకున్నాయి. 2027 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసి నీళ్లు ఇస్తాం. విధ్వంసం చేసిన వ్యక్తులు ఇంకా గొంతు చించుకుటున్నారు' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Whats_app_banner