AP Team To Davos : దావోస్ లో జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకు ఏపీ బృందం హాజరుకానుంది. ఈ మేరకు ఏపీ నుంచి ప్రతినిధుల బృందం హాజరయ్యేందుకు ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. జనవరి 20 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారాలోకేశ్, అధికారులు హాజరుకానున్నారు. ఈ నెల 19 తేదీన సీఎం చంద్రబాబు బృందం దావోస్ బయల్దేరి వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు బృందంతో పాటు పరిశ్రమలు, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు వెళ్లనున్నారు.
రాష్ట్రంలోని వనరులు, పెట్టుబడి అవకాశాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దావోస్ లో వివరించనున్నారు. రాష్ట్రంలో సాంకేతిక పాలన, పునరుద్పాదక విద్యుత్ ఉత్పత్తి, స్మార్ట్ సిటీస్, మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టుల్లో ఏపీలో ఉన్న అవకాశాలను దావోస్ లో పర్యటన సీఎం చంద్రబాబు వివరించనున్నారు. షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అనే థీమ్ తో ఈసారి దావోస్ లో ఏపీ ప్రభుత్వం ప్రదర్శన ఏర్పాటు చేయనుంది. దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ సదస్సులో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే స్టాల్ తో పాటు ఏపీకీ ఓ ప్రత్యేకంగా స్టాల్ రిజర్వు చేసింది కేంద్ర ప్రభుత్వం.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనవరి 13న ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. తెలంగాణ క్రీడావిశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీని పరిశీలించనున్నారు. ఈనెల 13వ తేదీ రాత్రి సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆస్ట్రేలియా బయలు దేరుతారు. జనవరి 14, 15, 16, 17 తేదీల్లో ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు. ఈనెల 18న సింగపూర్ చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడ షాపింగ్ మాల్స్, క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు పరిశీలించనున్నారు. సింగపూర్‌లో జరిగే పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొంటారు. అనంతరం ఈ నెల 19న సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్ సదస్సుకు వెళ్లనున్నారు. అక్కడ ఈ నెల 21 నుంచి 23 వరకు పర్యటించనుంది.
సంబంధిత కథనం