Vijayawada To Srisailam Seaplane : విజయవాడ-శ్రీశైలం మధ్య సీప్లేన్ సర్వీసులు ప్రారంభం, సీప్లేన్ లో సీఎం చంద్రబాబు ప్రయాణం
Vijayawada To Srisailam Seaplane : విజయవాడ నుంచి శ్రీశైలానికి సీప్లేన్ సర్వీసులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. విజయవాడ పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం వరకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీప్లేన్ లో ప్రయాణించారు. రాష్ట్రానికి టూరిజం ఒక వరమని సీఎం చంద్రబాబు అన్నారు.
విజయవాడలోని పున్నమిఘాట్ వద్ద... ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలానికి సీప్లేన్ సర్వీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విజయవాడలోని పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం వరకు సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సీప్లేన్ ప్రయాణించారు. దేశంలో తొలిసారిగా పర్యాటకంగా 'సీప్లేన్' సర్వీసులను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం దగ్గర సీప్లేన్ సర్వీసుల ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలానికి సీప్లేన్ లో 14 మంది ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తున్నారు.
సీప్లేన్ సర్వీసులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు...అనంతరం సభలో మాట్లాడారు. సీ ప్లేన్ ప్రయాణం ఒక వినూత్నమైన ప్రయాణం అన్నారు. రాష్ట్రానికి టూరిజం ఒక వరమని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, సంపద పెంచి, ఆ సంపద పేదలకు పంచాలి అనేది కూటమి ప్రభుత్వం విధానం అన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లామన్నారు. ప్రజలు గెలిపించారని, రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా పనిచేస్తామన్నారు.
"నేను నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యాను. కానీ, గత మూడు సార్లు ఎలాంటి ఇబ్బందులు పడలేదు కానీ, ఈ సారి మాత్రం మొత్తం విధ్వంసం అయిన వ్యవస్థని గాడిలో పెట్టటానికి చాలా సమస్యలు ఉన్నాయి. అయినా సరే వెనక్కు తగ్గేది లేదు. గాడి తప్పిన వ్యవస్థలని, గాడిలో పెట్టే దాకా నిద్రపోను"- సీఎం చంద్రబాబు
సీప్లేన్ ద్వారా రవాణా సౌకర్యం
భవిష్యత్‌లో ఏ ఇజం ఉండదు.. టూరిజం ఒక్కటే ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలో తొలిసారి పర్యాటకంగా 'సీ ప్లేన్' వినియోగిస్తున్నామని, ఏపీ నుంచి ఆరంభం అవుతుందన్నారు. సీప్లేన్ ప్రయాణం ఓ వినూత్న అనుభవం అన్నారు. రాష్ట్రంలో సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందన్నారు. సాంకేతికత చాలా వేగంగా పెరుగుతోందని, దానిని పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. ఐటీ అంటే ఆనాడు ఎగతాళి చేశారని, ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలన చూసిన తెలుగు వాళ్లే ఉన్నారన్నారు. నిత్యం కొత్త ఆలోచనలు చేయాలన్నారు. రానున్న రోజుల్లో ఎయిర్ పోర్టుల్లోనే కాకుండా సీప్లేన్ ద్వారా రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు.
బ్రాండ్ ఇమేజ్ తిరిగి తెచ్చే బాధ్యత
గాడితప్పిన పాలనను సరిచేయడమే తన లక్ష్యం అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థను బాగుచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్నారు. అనుకున్న ప్రగతిని సాధించాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. ఏపీలోని రోడ్లను చూసి అవహేళన చేస్తు్న్నారన్నారు. పోయిన ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను తిరిగి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ప్రజలు ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టారని, కూటమికి విజయం అందించారన్నారు.
4 రూట్లలో సీప్లేన్ సర్వీసులు
ఏపీలోని 4 రూట్లలో సీప్లేన్ సర్వీసుల ప్రతిపాదనలు ఉన్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. పర్యాటకులకు అందుబాటులో ఉండే విధంగా సీ ప్లేన్ ధరలు ఉంటాయన్నారు. పర్యాటక రంగం కూడా గణనీయంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు సీ ప్లేన్ పట్ల సానుకూలంగా ఉన్నారన్నారు. సీ ప్లేన్ ఆపరేటింగ్‌కు కేవలం రెండు కిలోమీటర్లు వాటర్ ఉంటే సరిపోతుందని అన్నారు. ఎయిర్ పోర్టులు లేని ప్రాంతంలో సీ ప్లేన్స్ బాగా ఉపయోగపడతాయన్నారు.