Pastor Praveen Pagadala : రాజమండ్రి శివారులో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి చెందారు. ఈ ఘటన సంచలనం అయ్యింది. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై డీజీపీతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై వస్తున్న ఆరోపణలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. హోంమంత్రి అనిత తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్‌కు ఫోన్ చేసి జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీకెమెరాలను పరిశీలించాలని ఆదేశించారు.
పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని తెలిపారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారన్నారు. వివిధ సంఘాలు పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించామని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి శివారులోని కొంతమూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిచెందినట్లు రాజానగరం సీఐ ఎస్.ప్రసన్న వీరయ్య గౌడ్ మంగళవారం మీడియాకు తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం బయలుదేరారు ప్రవీణ్ కుమార్. సోమవారం అర్ధరాత్రి సమయంలో కొంతమూరు వద్ద ఆయన ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదానికి గురైంది. రోడ్డు పైనుంచి దిగువకు ప్రమాదవశాత్తు జారిపడడంతో.. బుల్లెట్ బైక్ అతనిపై పడింది. ఈ ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని మంగళవారం ఉదయం 9 గంటల వరకు ఎవరూ గమనించలేదని సీఐ చెప్పారు.
అయితే పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై అనుమానాలు ఉన్నాయని క్రైస్తవ సంఘాల నేతలు రాజమండ్రి జీజీహెచ్ వద్ద ఆందోళనకు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు డీజీపీని ఆదేశించారు.
కల్వరిలో క్రైస్తవ బోధకుడిగా ఉన్న పాస్టర్ ప్రవీణ్ కొంతమూరు హైవేపై అనుమానస్పదంగా మృతి చెందారు. అయితే ఇటీవలె తనకు ప్రాణహాని ఉందని ప్రవీణ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనది హత్య లేక అనుకోని ప్రమాదంలో మృతి చెందారా? అనే అనుమానాలు తలెత్తాయి. ఆయన మృతదేహాన్ని పోలీసులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రవీణ్ ది హత్యేనని క్రైస్తవ ఆరాధకులు, ప్రవీణ్ బంధువులు ఆరోపిస్తున్నారు. గతంలో ఆయనను బెదిరిస్తూ వచ్చిన వీడియోలను చూపిస్తున్నారు. ప్రవీణ్ పెదాలు కమిలిపోయి ఉన్నాయని ఆరోపిస్తున్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు, ప్రవీణ్ బంధువులు చేరుకున్నారు.
మత ప్రభోదకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విచారణకు డిమాండ్ చేశారు. ప్రవీణ్ మరణంపై సన్నిహితులు, బంధువులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నందున దీనిపై నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సంబంధిత కథనం