Pothole Free Roads: రాష్ట్రంలో ఎక్కడా కూడా తనకు గుంతలున్న రహదార్లు కనిపించకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గతంలో రహదార్లపైన ప్రయాణించాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదని, దాన్ని పోగొట్టి ఇప్పుడు మన ప్రభుత్వం రహదార్లను బాగు చేశామని, ఇప్పుడు రోడ్లు కాస్త అందంగా కనిపిస్తున్నాయని, ఇది సంతోషదాయకమన్నారు. అయితే ఇక్కడితోనే మనం ఆగిపోకూడదని సూచించారు.
మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగంగా రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఇచ్చిన ప్రజంటేషన్ పైన సీఎం మాట్లాడారు. జాతీయ రహదార్లపైన కూడా తనకు ఎక్కడా గుంతలు కనిపించకూడదన్నారు. రహదార్లకు మరమ్మత్తులు చేయడం, రోడ్లు నిర్మించడం ఒక్కటే కాదని, వాటి నిర్వహణ కూడా నిరంతరం సమర్థవంతంగా చేయాలన్నారు. ఇప్పుడు మనం చేపట్టిన రోడ్లు నిర్మాణ పనులన్నీ కూడా నాలుగేళ్లలో పూర్తి కావాలన్నారు.
అర్బన్ ఏరియాలో కూడా ఎక్కడా గుంతలున్న రహదార్లు తనకు కనిపించ కూడదన్నారు. కేంద్రం ప్రభుత్వం చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణాలు, రైల్వే నిర్మిస్తున్న రైల్వై వంతెనల నిర్మాణాలు చేపడుతుంటుందని, కేంద్రంతో కూడా సమన్వయం ఏర్పాటు చేసుకుని ఆ పనులు ప్రగతిని కూడా సమీక్షించుకోవాలని, రాష్ట్రంలో కనెక్టివిటీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఈ నెలాఖరులోపు రాష్ట్రంలో ఆర్ అండ్ బీ రహదార్లన్నిటినీ గుంతల రహిత రహదార్లుగా మారుస్తామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే చెప్పారు. 20,059 కిలోమీటర్ల రోడ్లను గుంతల రహితంగా మార్చాలనే లక్ష్యంలో ఇప్పటికే జనవరి నెలాఖరుకు 14,168 కిలోమీటర్లు గుంతల రహితంగా మార్చామన్నారు.
మిగిలింది కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రామం నుంచి మండల కేంద్రం, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రహదారులు వేయాలనే కార్యక్రమం వేగంగా జరుగుతోందన్నారు. 2026 మార్చి నెలాఖరులోపు మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రహదారుల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
గ్రామాల్లో రహదారుల మరమ్మతులు, నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఒక సవాల్ వంటిదన్నారు. మంత్రులు, కార్యదర్శుల సదస్సులో పంచాయతీరాజ్ శాఖ ప్రజంటేషన్‌పైన ఆయన స్పందిస్తూ నరేగా నిధులు సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు.
ఈ నెల, వచ్చే నెల ఎంతమేర పనులు చేస్తారో ఆ మేరకు పూర్తి చేయాలన్నారు. వచ్చే సంవత్సరం లక్ష్యాలను మరింత పెంచుకుని పనిచేయాలని సూచించారు. డ్వాక్రా సంఘాలు గత ప్రభుత్వ నిర్వాకం వల్ల నిస్తేజంగా మారాయని తెలిపారు. మూడు దశాబద్దాల చరిత్ర మన డ్వాక్రా సంఘాలకుందని వివరించారు. ఒకప్పుడు మన డ్వాక్రా సంఘాల మహిళలు హిందీ భాష రాకపోయినా ఇతర రాష్ట్రాలకు వెళ్లి డ్వాక్రా ఫిలాసఫీ బోధించి వచ్చిన సందర్భాలున్నాయని అయితే ఇప్పుడు ఆ స్ఫూర్తి సంఘాల్లో లోపించిందన్నారు.
డ్వాక్రా సంఘాలు తీసుకుంటున్న రుణాలు ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. వివిధ పథకాల కింద డ్వాక్రా సంఘాలకు రూ.50 వేల కోట్ల లింకేజీ పెడుతున్నామని, అలాంటప్పుడు ఈ సంఘాల పనితీరు మెరుగుపరిచేలా ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. ఆయా డ్వాక్రా సంఘాల్లో ఏఏ నైపుణ్యాలున్నాయి, వారు చేసే వ్యాపారం ఎలా ఉంది తదితర అంశాలన్నీ బేరీజు వేసి వారిలో మళ్లీ చైతన్యం తీసుకొచ్చి సత్ఫలితాలు సాధించేలా చూడాలన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలు అభివృద్ధి చ ఎందకపోతే ఎప్పటికీ పేదరికం రూపుమాపలేమని ఈవిషయాన్ని అధికారులు గుర్తించి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు.