Polavaram: గోదావరి పుష్కరాల్లోపు పోలవరం పూర్తి చేస్తామన్న సీఎం చంద్రబాబు, కేంద్రం సాయంతో వేగంగా నిర్మాణాలు-cm chandrababu naidu says polavaram will be completed within godavari pushkaram ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Polavaram: గోదావరి పుష్కరాల్లోపు పోలవరం పూర్తి చేస్తామన్న సీఎం చంద్రబాబు, కేంద్రం సాయంతో వేగంగా నిర్మాణాలు

Polavaram: గోదావరి పుష్కరాల్లోపు పోలవరం పూర్తి చేస్తామన్న సీఎం చంద్రబాబు, కేంద్రం సాయంతో వేగంగా నిర్మాణాలు

Sarath Chandra.B HT Telugu

Polavaram: గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యే లోపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పోలవరం నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని 2026 ఫిబ్రవరి కల్లా ప్రధాన ఆనకట్టలో గ్యాప్ 1 పూర్తవుతుందని చెప్పారు.

సీఎం చంద్రబాబును సన్మానిస్తున్న పోలవరం ముంపు మండలాల ప్రజలు

Polavaram: గోదావరి పుష్కరాలు మొదలయ్యేలోపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రాజెక్టు పురోగతిని పరిశీలించిన చంద్రబాబు పునరావాస చర్యల్ని సమీక్షించారు. 207 ఫిబ్రవరికల్లా ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

2019లో ప్రభుత్వం మారడంతో పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏమైందో అంతా చూశారని, డయాఫ్రం వాల్‌ను దెబ్బతీశారని కాఫర్ డ్యాం సకాలంలో పూర్తి చేసి ఉంటే డయాఫ్రం వాల్ దెబ్బ తినేది కాదని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పరిస్థితిని అధ్యయనం చేయడానికి విదేశీ నిపుణులు వచ్చి పరిశీలించారని చంద్రబాబు చెప్పారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని సూచించడంతో మళ్లీ రూ.990 కోట్లతో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాల్సి వచ్చిందన్నారు. అంతకు ముందు ఖర్చు పెట్టిన రూ.440 కోట్లు వృథా అయ్యాయని, డయాఫ్రం వాల్‌ను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.

ఎర్త్‌ కమ్ రాక్‌ ఫిల్ డ్యామ్‌ ( ఈసీఆర్ఎఫ్) గ్యాప్-1ను 2026 ఫిబ్రవరి 26కు పూర్తి చేస్తామని ఎడమ కాలువ 2026 జూన్‌కు పూర్తవుతుందని చెప్పారు. ఈసీఆర్ఎఫ్ గ్యాప్-2 మాత్రం 2027 డిసెంబర్‌కు గడువు విధించినట్టు చెప్పారు.

భూసేకరణపై ఫోకస్..

టెక్నికల్ సమస్యలు ఉంటే తప్ప 2027 ఏప్రిల్ లేదా జూన్‌కు పోలవరం పూర్తి చేయాలని ఆదేశించాను. ఫేజ్-1ఏ, ఫేజ్-2- 1ఏ, 1బీ పూర్తికి భూ సేకరణ ఇంకా చేయాల్సి ఉందన్నారు. దాదాపు 26 పునరావాస కాలనీలు పూర్తయ్యాయని, మరో 49 పూర్తి కావాల్సి ఉందని చెప్పారు.

ఇప్పటివరకు 14,329 మందిని పునరావాసాలకు తరలించినట్టు సీఎం చెప్పారు. మరో 6,578 మందిని తరలించాల్సి ఉందని ఇవన్నీ పూర్తి చేయాలంటే మరో రూ.500 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉందన్నారు. రూ.972 కోట్లు ఖర్చు చేసి ఈ ఏడాది నవంబర్‌కు ఫేజ్-1ఏలో ఉండే అందరికీ పునరావాసం కల్పిస్తామని చెప్పారు.

ఫేజ్‌ 1లో 41.15 మీటర్ల ఎత్తున నిర్మాణాలు…

జూలై 2026కు ఫేజ్-1బి కింద 6 మండలాల్లో 48 పునరావాసాలు పూర్తి చేస్తామని వివరించారు. ఫేజ్-1ఏ, ఫేజ్-2 1ఏ, 1బీకి కలిసి రూ.6,270 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని , ఫేజ్-1లో 41.15 మీటర్ల వరకు ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందన్నారు. వాస్తవానికి ప్రాజెక్టు ఎత్తు 45.74 మీటర్లు అని 2019కి ముందు ఈ ఫేజ్1, ఫేజ్2 ప్రస్తావన లేదని ఇది కూడా గతపాలకుల తప్పే అన్నారు. కానీ మళ్లీ వెనక్కి వెళ్తే ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం అని మొదట ఫేజ్1 పూర్తి చేసి తర్వాత ఫేజ్-2 మొదలుపెడతామని చెప్పారు.

రివర్స్ టెండర్ పేరుతో రాజకీయం చేశారని దీని వల్ల రూ.2,782 కోట్లు అదనపు భారం పడిందని కాంట్రాక్టర్లను మార్చారని . 6 నెలల పాటు ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు.

9 నెలల్లోనే 3 సార్లు పరిశీలించా

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 3వసారి పోలవరం ప్రాజెక్టును పరిశీలించడానికి వచ్చానని 9 నెలల్లోనే ప్రాజెక్టును గాడినపెట్టాం. సులభంగా పూర్తవ్వాల్సిన ప్రాజెక్టును నాశనం చేశారని ఆరోపించారు.. 2019లో మేం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండుంటే 2020 ఆగస్టు నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్లం. పోలవరం ఏపీకి జీవనాడి. ఇది పూర్తైతే 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 23.50 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు 28.5 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించవచ్చన్నారు.

పునరావాస ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు

భూసేకరణ, పునరావాసానికి కూడా అదనంగా ఖర్చు అవుతోందని ఒక వ్యక్తి చేసిన తప్పులను రాష్ట్రం ఏ విధంగా భరించాల్సి వస్తుందనడానికి ఇదొక ఉదాహరణ అని చంద్రబాబు చెప్పారు. సాగునీరు వచ్చినప్పుడు రైతులు ఆనందంగా ఉంటారు. కానీ ప్రాజెక్టు కోసం తరాలుగా ఉంటున్న ప్రజలు కూడా వారి భూములు, ఆవాసాలు కోల్పోవాల్సి ఉంటుందని వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అదనంగా ఇంకా ఏమీ చేయగలుగుతామో ఆలోచించి, వారి జీవితాల్లో మరింత మార్పులు తీసుకురావాల్సి ఉంది. పునరావాస ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తాం. ఎంఎస్ఎంఈలు పెట్టుకుంటే ప్రభుత్వ తరఫున ప్రోత్సహిస్తామన్నారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం