రాష్ట్రంలో శరవేగంగా రహదారుల నిర్మాణం జరగాలి - సీఎం చంద్రబాబు-cm chandrababu naidu orders speedy completion of road works in the state ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  రాష్ట్రంలో శరవేగంగా రహదారుల నిర్మాణం జరగాలి - సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో శరవేగంగా రహదారుల నిర్మాణం జరగాలి - సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో శరవేగంగా రహదారుల నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జూలై నెలాఖరుకు ఆటంకాలు తొలిగించాలన్నారు. ఈ ఏడాది 1,040 కి.మీ. జాతీయ రహదారుల నిర్మాణం లక్ష్యంగా పనులు జరగాలని దిశానిర్దేశం చేశారు.

సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, త్వరలో నిర్మించ తలపెట్టిన అన్ని రాష్ట్ర, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు పనులు వేగవంతం కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భూసేకరణ, అటవీ, వన్యప్రాణి క్లియరెన్స్ సమస్యలు జూలై నెలాఖరుకు పరిష్కరించాలన్నారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలని చెప్పారు.

సోమవారం సచివాలయంలో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. వివిధ రహదారి ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. నిర్ణీత కాలవ్యవధికి మించి ఆలస్యమైన ప్రాజెక్టుల కాంట్రాక్ట్ సంస్థలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి... ఇకపై ఏ రహదారి నిర్మాణమూ ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు. మరోవైపు ఎన్‌హెచ్ఏఐ, ఎంఓఆర్టీహెచ్ కింద రూ.11,325 కోట్లతో 770 కి.మీ రహదారులు గత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

144 ప్రాజెక్టుల నిర్మాణం….

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్‌హెచ్‌ఏఐ, ఎంఓఆర్టీహెచ్ కింద రూ.76,856 కోట్లతో 144 ప్రాజెక్టులకు చెందిన 3,483 కి.మీ వరకు రహదారులు నిర్మాణంలో ఉన్నాయి.వీటిలో ఎన్‌హెచ్‌ఏఐ కింద 1,392 కి.మీ. రహదారులు, 2,091 కి.మీ ఎంవోఆర్‌టీహెచ్ రహదారులు ఉన్నాయి. ఇందులో ఈ సంవత్సరం రూ.20,067 కోట్ల విలువైన 1,040 కి.మీ. రహదారి పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా నిర్దేశించారు.

గుంతలు లేని రహదారులు కోసం గత ఏడాది నవంబర్‌లో రూ.860.81 కోట్లతో ముఖ్యమంత్రి ప్రారంభించిన పనుల్లో 97 శాతం ఈ జూన్ 6 నాటికి పూర్తయ్యాయి. 19,475 కి.మీ. మేర రహదారుల్లో గుంతలన్ని పూడ్చి.. మరమ్మతులయ్యాయి. మిగిలిన రహదారుల మరమ్మతులు జూలై 31 నాటికి పూర్తికానున్నాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.