స్కాన్ చేసి నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించొచ్చు.. ఏపీ ఎక్సైజ్‌ సురక్షా యాప్‌‌ను ప్రారంభించిన చంద్రబాబు!-cm chandrababu naidu launches ap excise suraksha app to curb spurious liquor sales details inside ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  స్కాన్ చేసి నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించొచ్చు.. ఏపీ ఎక్సైజ్‌ సురక్షా యాప్‌‌ను ప్రారంభించిన చంద్రబాబు!

స్కాన్ చేసి నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించొచ్చు.. ఏపీ ఎక్సైజ్‌ సురక్షా యాప్‌‌ను ప్రారంభించిన చంద్రబాబు!

Anand Sai HT Telugu

నకిలీ మద్యం కేసులో షాకింగ్‌ విషయాలు బయటకు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. కల్తీ మద్యంపై విచారణకు జీవీజీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు.

చంద్రబాబు

నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించడానికి రూపొందించిన ఏపీ ఎక్సైజ్‌సురక్షా యాప్‌‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో కల్తీ మద్యం వైసీపీ ప్రభుత్వం నుంచి వారసత్వ సంపదగా వచ్చిందని చంద్రబాబు విమర్శించారు. నకిలీ మద్యం కేసులో విస్తూపోయే విషయాలు బయటకు వస్తున్నాయన్నారు. కానీ ఇప్పుడు వాటిపై తాను మాట్లాడదలుచుకోలేదన్నారు.

'కల్తీ మద్యంపై విచారణకు జీవీజీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేశాం. నకిలీ మద్యంపై సిట్‌ బృందంతో మొత్తం ప్రక్షాళన చేస్తాం. సిట్‌లో రాహుల్‌దేవ్‌ శర్మ, కె.చక్రవర్తి, మలికా గార్గ్‌ సభ్యులుగా ఉంటారు.' అని చంద్రబాబు అన్నారు.

ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్‌తో నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించవచ్చని సీఎం చంద్రబాబు చెప్పారు. కేవలం స్కాన్ చేస్తే చాలు సీసాకు సంబంధించిన వివరాలు తెలుస్తాయన్నారు. ఎక్కడ అమ్ముతారో అక్కడే జియో ట్యాగింగ్ అవుతుందన్నారు. మరోకచోట అమ్మేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. అలా చేయడం కూడా నేరమేనని సీఎం వెల్లడించారు.

'స్కాన్ చేసిన తర్వాత తయారీ కేంద్రం, తేదీ, బ్యాచ్ అన్నీ వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతం ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూస్తాం. నకిలీ మద్యం కేసుల్లో రాజీ పడేది లేదు. ప్రక్షాళన చేస్తాం. బెల్టు షాపుల్లో అమ్మితే కఠిన చర్యలు ఉంటాయి.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

గత పాలకులు గంజాయి, కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కల్తీ మద్యాన్ని చట్టబద్ధం చేసి నేర సామ్రాజ్యాన్ని సృష్టించారన్నారు. కల్తీ మద్యం నివారణకు సిట్, గంజాయి నివారణకు ఈగల్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నేరస్తులు ఎలాంటి వేషంలో వచ్చినా.. కట్టడి చేస్తామన్నారు చంద్రబాబు. ఎవరైనా ఉపేక్షించేది లేదన్నారు. రాజకీయ ముసుగులో తప్పులు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మళ్లీ ఇలాంటి నేరాలు చేయాలని చూస్తే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తామన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.