CBN on Delhi Results : వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం ఢిల్లీని మార్చేశాయి : చంద్రబాబు-cm chandrababu naidu key comments on delhi assembly election results ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn On Delhi Results : వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం ఢిల్లీని మార్చేశాయి : చంద్రబాబు

CBN on Delhi Results : వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం ఢిల్లీని మార్చేశాయి : చంద్రబాబు

Basani Shiva Kumar HT Telugu
Published Feb 08, 2025 05:51 PM IST

CBN on Delhi Results : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం ఢిల్లీని మార్చేశాయని వ్యాఖ్యానించారు. భారత్‌కు సరైన సమయంలో సరైన నేత నరేంద్ర మోదీ అని సీబీఎన్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఫెయిల్యూర్ మోడల్ అయ్యిందన్నారు.

చంద్రబాబు
చంద్రబాబు

దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి బీజేపీని గెలిపించారని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రజలందరి ఆత్మగౌరవానికి సంబంధించిన గెలుపు ఇది అని అభివర్ణించారు. దేశ, రాష్ట్ర రాజధానులు ప్రజల ఆకాంక్షలు తీర్చేవిగా ఉండాలని చెప్పారు. వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం ఢిల్లీని మార్చేశాయన్నారు.

అందుకే బీజేపీని ఆదరించారు..

'సుస్థిర అభివృద్ధి విధానాన్ని ప్రధాని మోదీ అమలు చేస్తున్నారు. అందుకే బీజేపీని ప్రజలు ఆదరించారు. అభివృద్ధి ఉంటేనే సంపద సృష్టి జరుగుతుంది. గుడ్ గవర్నెన్స్ అండ్ గుడ్ పాలిటిక్స్ ఉండాలి. భారత్‌లో ఆర్థిక సంస్కరణలు మొదలు పెట్టి 34 ఏళ్లు అయ్యింది. 1991కి ముందు వెనకా చూస్తే.. స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. సంస్కరణల తరవాతే అందరికీ సమాన అవకాశాలు వచ్చాయి' అని చంద్రబాబు వివరించారు.

అప్పుడు అభివృద్ధి సాధ్యం..

'ఇన్నేళ్లలో గుజరాత్ తలసరి ఆదాయం 15 రెట్లు పెరిగితే.. పశ్చిమ బెంగాల్ తలసరి ఆదాయం 4 రెట్లు మాత్రమే పెరిగింది. ఏపీలోనూ తలసరి ఆదాయం పెరిగింది. పాలనా మార్పుల కారణంగా వచ్చిన సంస్కరణల వల్లే ఈ సంపద సృష్టి జరుగుతుంది. టీడీపీ హయాంలో సాంకేతికత, మంచి పాలనా విధానాలు, అనుసరించాం. సరైన సమయంలో దార్శనిక నేత ఉంటే అభివృద్ధి సాధ్యం అవుతుంది' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

సరైన నేత మోదీ..

'భారత్‌కు సరైన సమయంలో సరైన నేత నరేంద్ర మోదీ. సంక్షేమం ఇస్తున్నామని మాయ మాటలు చెప్పి బటన్ నొక్కి అవినీతి చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, ఇతర కార్యక్రమాల ద్వారా రాజకీయ కాలుష్యం వెరసి రాష్ట్ర విధ్వంసం జరిగింది. ఢిల్లీ సిటి ఆఫ్ గార్బేజ్‌గా మారింది. ఎక్కడ చూసినా కాలుష్యం. విదేశీ అతిథులు వచ్చినా వాటి మధ్యే తిరగాల్సిన పరిస్థితి. నేను ఎవరిని వ్యక్తిగతంగా నిందించడం లేదు' అని సీబీఎన్ స్పష్టం చేశారు.

ఢీల్లీ మోడల్ ఫెయిల్..

'ఢిల్లీ ఫెయిల్యూర్ మోడల్ అయ్యింది. గతంలో పంజాబ్ అంటే వ్యవసాయం. ఇప్పుడు డ్రగ్స్‌తో నిండిపోయింది. ప్రతీ రోజూ పంజాబ్ నుంచి వచ్చే రైళ్లలో కాన్సర్ పేషెంట్లు ఉంటున్నారు. ఏపీతో పోలిస్తే ఢిల్లీ మద్యం వ్యవహారంలో ఏమీ లేదు. నాణ్యత లేని మద్యంతో ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితి. వ్యవస్థ అంతా సర్వ నాశనం అయిపోయింది. వైసీపీ హయాంలో ఏపీలో అన్ లైన్ పెమెంట్లు కూడా లేకుండా చేశారు' అని చంద్రబాబు ఆరోపించారు.

రుషికొండ లాగే ఢిల్లీలో..

'ఏపీలో రుషికొండలో ప్రజల డబ్బుతో ప్యాలస్ నిర్మించారు. ఢిల్లీలో శేష్ మహల్ కూడా ఆ తరహానే కట్టారు. ఏపీలో ఎమ్మార్వో కార్యాలయం తాకట్టు పెట్టి, మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. ఇలా రెండు చోట్లా ప్రజల ఆకాంక్షలు ఆవిరి అయిపోయాయి. ఓటు వేసిన పాపానికి ప్రజలను వీరు కాటేశారు. విధ్వంసం చేయడం సులభమే. కానీ నిర్మాణం చేయడమే చాలా కష్టం' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ప్రజల్లో చైతన్యం రావాలి..

'ప్రజల జీవన ప్రమాణాలు పెంచలేనీ వ్యక్తులు, అభివృద్ధి చేయలేని వ్యక్తులు పాలనలోకి రావడం ఎందుకు. దేశంలోని ఓటర్లు అందరికీ కామన్ సెన్స్ ఉంది. అందుకే ప్రజలు విధ్వంసం చేసిన వ్యక్తులను ఓడించారు. ప్రజల్లో చైతన్యం రావాలని కోరుకుంటున్నాం. విధ్వంసం చేసేసి.. తీరా ఇప్పుడు రాజకీయ ఆరోపణలు చేస్తామంటే ఎలా.. గతంలో వివిధ విధానాలు, విజన్ వల్ల కలిగిన ప్రయోజనాలు బేరీజు వేయండి. ప్రధాని మోదీ వికసిత భారత్ అంటే.. నేను వికసిత ఏపీ 2047 డాక్యుమెంట్ రూపొందించా' అని చంద్రబాబు వివరించారు.

Whats_app_banner