కేంద్రమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - బనకచర్లపై కీలక చర్చ..!-cm chandrababu meets union home minister amit sha in delhi ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కేంద్రమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - బనకచర్లపై కీలక చర్చ..!

కేంద్రమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - బనకచర్లపై కీలక చర్చ..!

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై చర్చించారు. బనకచర్ల ప్రాజెక్ట్ అంశంపై కూడా పలు వివరాలను చంద్రబాబు వివరించారు.

కేంద్రమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై ఇరువురు నేతలు చర్చించారు. ముందుగా మాజీ కేంద్ర మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గవర్నర్ గా నియమించడంపై హోం మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం ధన్యవాదాలు తెలియచేశారు. అనంతరం రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై అమిత్ షాతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు.

రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు, ఆభివృద్ది కార్యక్రమాలకు ఆర్ధిక సాయం అందించే అంశాలపై సీఎం హోం మంత్రికి వివరించారు. గత ఏడాదిగా క్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రానికి అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియచేసిన ముఖ్యమంత్రి కేంద్ర సహకారంతో ధ్వంసమైన ఆర్దిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని తెలియచేశారు. అయితే ఇప్పటికీ ఆర్ధిక వనరుల పరంగా తీవ్రమైన కొరతను ఎదుర్కోంటున్న ఏపీకి కేంద్రం నుంచి మరింతగా సహకారం అందించే అంశాన్ని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు.

బనకచర్ల ప్రాజెక్ట్ పై చర్చ….

విభజన వల్ల ఏపీ ఎదుర్కొన్న ఆర్ధిక నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని నిధుల కేటాయింపులు చేసేలా చూడాలని 16వ ఆర్ధిక సంఘానికి నివేదించామని అమిత్ షాకు సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు నీటిని తరలించేందుకు కీలకమైన పోలవరం –బనకచర్ల లింక్ ప్రాజెక్టు అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. పోలవరం నుంచి కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ వరకూ 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా ఈ లింక్ ప్రాజెక్టు ప్రతిపాదించినట్లు తెలిపారు. అనుసంధాన ప్రాజెక్టు పూర్తి అయితే కరవు పీడిత రాయలసీమ ప్రాంతానికి దక్కే ఫలితాలను అమిత్ షాకు సీఎం చంద్రబాబు వివరించారు.

గోదావరి నదిలో ఎగువ, దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 రోజుల మిగులు జలాలు ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు. నదీ ప్రవాహ మార్గంలో చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు… హోం మంత్రి అమిత్ షాకు తెలియచేశారు.

అంతకుముందు ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో నీతి ఆయోగ్ సభ్యులు వి.కె. సారస్వత్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎరో స్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుపై సారస్వత్ తో ముఖ్యమంత్రి చర్చించారు. రాయలసీమ ప్రాంతంలో డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని ఈ పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు ఆ రంగంలో పరిశ్రమలు, పెట్టుబడులు సాధించేందుకు అనుసరించాల్సిన అంశాలపై ఇరువురూ చర్చించారు. అనంతరం ఢిల్లీ మెట్రో రైల్ ఎండి వికాస్ కూడా ముఖ్యమంత్రిని కలిశారు. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో నిర్మాణంపై సహకారంపై చర్చించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.