CBN With Bill Gates : దావోస్ లో బిల్ గేట్స్ లో చంద్రబాబు భేటీ-1995 ఐటీ, 2025లో ఏఐ అని సీఎం ట్వీట్
CBN With Bill Gates : మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దావోస్ లో భేటీ అయ్యారు. ఏపీలో ఏర్పాటుచేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వామ్యం వహించాలని బిల్ గేట్స్ ను కోరారు.
CBN With Bill Gates : మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ ఐటీ దిగ్గజం బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దావోస్ ప్రొమెనేడ్ మైక్రోసాఫ్ట్ కేఫ్ లో భేటీ అయ్యారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ, సహకారాలను అందించాలని సీఎం కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వామ్యం వహించాలని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్‌ను ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరారు. రాష్ట్రంలోని ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్‌ను నడపడానికి ఆఫ్రికాలో హెల్త్ డ్యాష్‌బోర్డ్‌ల తరహాలో సామాజిక వ్యవస్థాపకతలో ఫౌండేషన్ తరపున నైపుణ్య సహకారాన్ని అందించాలని బిల్ గేట్స్‌ని కోరారు. దక్షిణ భారతంలో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్‌వేగా నిలపాలని, స్థానిక ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
"1995లో ఐటీ, ఇప్పుడు 2025 లో ఏఐ. చాలా సంవత్సరాల తర్వాత బిల్ గేట్స్ ను కలవడం ఆనందంగా ఉంది" అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
దావోస్ లోని మైక్రోసాఫ్ట్ కేఫ్ లో బిల్ గేట్స్ ను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కలిశారు. ఈ సమావేశంలో యూఎస్ఏ వెలుపల మైక్రోసాఫ్ట్ మొట్టమొదటి అభివృద్ధి కేంద్రం హైదరాబాద్‌ను ఐటీ పవర్‌హౌస్‌గా ఎలా మార్చిందనే దానిపై ఈ భేటీలో చర్చ జరిగిందని మంత్రి లోకేశ్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కోసం తన దార్శనికతను. స్వర్ణ ఆంధ్ర విజన్ 2047ను, రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి మద్దతు, సహకారాన్ని అందించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిని అభ్యర్థించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ప్రపంచ స్థాయి ఏఐ విశ్వవిద్యాలయం సలహా బోర్డులో చేరమని బిల్ గేట్స్‌ను ఆహ్వానించామన్నారు. దక్షిణ భారతదేశంలో బిల్ & మెలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్‌ను గేట్‌వేగా మార్చడాన్ని పరిగణించమని కోరామన్నారు. తమ అభ్యర్థనలపై బిగ్ గేట్స్ సానుకూలంగా స్పందించారన్నారు. ఏపీలో వారి అడుగుజాడలు త్వరలో చూడాలని ఎదురు చూస్తున్నానని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.
గూగుల్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ
గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, గుగూల్ ఇంటర్నేషనల్ మేనేజర్ ఆండ్రీ నకాజాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టెక్నాలజీలో తాజా పురోగతులను, ఆంధ్రప్రదేశ్‌లోని అద్భుతమైన అవకాశాలపై చర్చించారు. ఏపీలోని ప్రతిభావంతులైన యువతతో, టెక్ భవిష్యత్తును పునర్నిర్వచించటానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు అన్నారు.
సంబంధిత కథనం