AP Floods : వరద బాధితులను ఇబ్బందిపెట్టొద్దు.. వారం రోజుల్లో క్లెయిమ్‌లు పరిష్కరించండి - సీఎం చంద్రబాబు
బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. భారీ వరదల వల్ల విపత్తు వచ్చిందన్నారు. క్లెయిమ్‌ల పరిష్కారంలో వేగంతో పాటు సరైన న్యాయం అవసరమని అభిప్రాయపడ్డారు. ఏడు రోజుల్లో క్లెయిమ్‌ల పరిష్కారం పూర్తిఅయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. శుక్రవారం ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ముఖ్య కార్యదర్శి (ప్లానింగ్) పీయూష్ కుమార్ పాల్గొన్నారు.
సమావేశంలో వరద నష్టాల క్లెయిమ్‌ల పరిష్కారం, రుణాల రీషెడ్యూలింగ్, రీ స్ట్రక్చర్, మారటోరియం, అవసరం ఆధారిత కొత్త రుణాల మంజూరు, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేరింగ్ తదితరాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు.
సరైన న్యాయం చేయాలి - సీఎం చంద్రబాబు
క్లెయిమ్‌ల పరిష్కారంలో వేగంతో పాటు సరైన న్యాయం అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మానవతా కోణంలోనూ బాధితులకు సహాయసహకారాలు అందించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిందంతా చేస్తున్నాయని…ఇదే విధంగా ఇన్సూరెన్స్, బ్యాంకులు సేవలందించాలని కోరారు. ఏడు రోజుల్లో క్లెయిమ్‌ల పరిష్కార పూర్తికావాలని స్పష్టం చేశారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని.. చివరి వరకూ న్యాయం అందాలన్నారు.
“గతంలో ఎన్నడూలేని విధంగా విజయవాడకు వరద ముంపు ఎదురైంది. సంక్షోభ స్థితిలో ఉన్నవారికి మానవతా కోణంలో సహాయసహకారాలు అందించాల్సిన అవసరముంది. బీమా క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికి విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా న్యాయమైన సెటిల్‌మెంట్స్ జరిగేలా చూడాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు నిబద్ధతతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సేవలందించాలి. వాహనాలు, గృహాలు, వ్యాపార వాణిజ్య ఆస్తుల నష్టాలకు సంబంధించి జరిగిన నష్టాలపై వచ్చిన ప్రతి క్లెయిమ్‌నూ సరైన విధంగా అసెస్ చేసి ఆ మేరకు పూర్తిస్థాయిలో సెటిల్‌మెంట్ చేయాలి. మొత్తంమీద పదిరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు కృషిచేయాలి” అని సీఎం చంద్రబాబు సూచించారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ ఫోర్స్‌డ్ సెటిల్‌మెంట్స్ జరగవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఒకవేళ క్లెయిమ్‌ల పరిష్కారంలో నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం పరంగా తగిన చర్యలకు ముందుకెళ్ళాలన్నారు. ప్రో యాక్టివ్‌గా బ్యాంకులు వరద ప్రభావిత ప్రజలకు సేవలందించాలని కోరారు. రుణాల రీషెడ్యూలింగ్, రీస్ట్రక్చర్ వెసులుబాట్లను కచ్చితత్వంతో అమలుచేయాలని సూచించారు.వడ్డీ విషయంలో అదనపు భారం అనేది లేకుండా చూడాలన్నారు.
పాడైన ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ల విషయంలో కంపెనీలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 100 శాతం లేబర్ ఛార్జీల్లో, 50 శాతం వరకు స్పేర్ పార్ట్స్‌లో రాయితీ కల్పిస్తూ సేవలందించాలన్నారు. ఇప్పుడు స్పందించే తీరే కస్టమర్లలో విశ్వసనీయతను పెంపొందిస్తుందని… మార్కెట్లో బ్రాండ్ నిలబడుతుందని వ్యాఖ్యానించారు. అవసరం మేరకు టెక్నీషియన్లను పెంచుకోవాలని… హైదరాబాద్, చెన్నై నుంచి కూడా వనరులను సమీకరించుకోవాలని సూచించారు.
ఢిల్లీకి చంద్రబాబు - ఏచూరి మృతికి సంతాపం:
సిపిఎం నేత సీతారాం ఏచూరి మృతికి సంతాపం ప్రకటిస్తూ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న ఏచూరి నివాసంలో వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం నేత బృందాకారత్ మరియు ఏచూరి కుటుంబసభ్యులతో ఎన్నో సంవత్సరాలుగా ఏచూరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
బడుగు - బలహీన, తాడిత - పీడిత వర్గాల అభ్యున్నతి కోసం ఏచూరి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఏచూరి కమ్యూనిస్టు భావజాలాన్ని నమ్మడమే కాకుండా జీవితంలో ఆచరించారన్నారు. గొప్ప రచయిత, రాజకీయవేత్త, ఆదర్శప్రాయుడు, అజాతశత్రువు అని చెప్పారు. తెలుగువాడైన సీతారాం ఏచూరి మృతి చెందడం ఎంతో బాధ కలిగిస్తోందని ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు.