CM CBN Delhi Tour : నదుల అనుసంధానానికి సహకరించండి - సీఎం చంద్రబాబు కీలక విజ్ఞప్తులు
CM Chandrababu Delhi Tour Updates : రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునురుద్ధరించాలని సీఎం చంద్రబాబు కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌ను కోరారు. అలాగే రాష్ట్ర జీఎస్‌టీలో ఒక శాతం సర్‌చార్జ్ పెంపునకు అనుమతి ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహరాల మంత్రి జై శంకర్‌తో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. తొలిత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు, విజయవాడ వరద సమయంలో నష్టపోయిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పినతో సహా నష్టాన్ని పూడ్చేందుకు రాష్ట్ర జీఎస్‌టీపై ఒక శాతం సర్ ఛార్జ్ పెంచుకోవాడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
మా రాష్ట్రానికి పంపించండి..
కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు, అమరావతిలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధించాలని, దానిపై దృష్టి పెట్టాలని కోరారు. అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో దాని ప్రభావం దేశంపైన, దేశ ఆర్థిక వ్యవస్థపైన ఎలా ఉంటుందో, ఎటువంటి మార్పులు జరుగుతాయనే అంశాలపై చర్చించారు.
దేశం చేపట్టే చర్యలపై ఆంధ్రప్రదేశ్ పాత్రపై కూడా చర్చించినట్లు చెప్పారు. అలాగే పెట్టుబడిదారులు వస్తే తమ రాష్ట్రానికి పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దేశానికి ఏ ప్రతినిధి బృందం వచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు మళ్లిస్తామని విదేశాంగ మంత్రి బదులిచ్చారు. విద్యార్థులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇమ్మిగ్రేషన్ సమస్యను పరిష్కరించాలని కోరారు. అమెరికా వెళ్లే ఇండియా విద్యార్థులపై ప్రభావం ఎలా ఉంటుందో చర్చించారు.
అనంతరం టీడీపీ ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, తెన్నేటి కృష్ణ ప్రసాద్‌తో కలిసి టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన విషయాలను వెల్లడించారు. జీఎస్‌టీ శాతం పెంపునకు కోరామని, అలాగే గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి సాయం కోరినట్లు చెప్పారు. అందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. జీఎస్‌టీ తాత్కాలింక పెంచుతామని కోరామన్నారు.
అనుసంధానంతో ప్రకాశం, రాయలసీమకు నీళ్లు..
గోదావరి-పెన్నా నదులు అనుంధానం ప్రాజెక్టును దాదాపు రూ.60 వేల కోట్లపైగా వ్యయంతో తీసుకువస్తున్నామని, డీపీఆర్ పూర్తి అయిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లేందుకు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీదే భారం పడకుండా, కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అడుగుతున్నామని చెప్పారు.
ఈ ప్రాజెక్టు రాయలసీమ, ప్రకాశం జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ఉపయోగపడుతోందని వివరించారు. పోలవరం పూర్తి అయిన తరువాత అక్కడ నుండి కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీలో నీటిని పోస్తున్నామని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నాగార్జున సాగర్ కుడికాలువకు నీరు పంపించేందుకు 2015-16లోనే ప్రాజెక్టు టెండర్ కూడా చేశారని గుర్తుచేశారు. అయితే తరువాత ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదని వివరించారు.
ఇప్పుడు గోదావరి-పెన్నా నదులు అనుసంధానంతో ప్రకాశం బ్యారేజీ నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటిని పంపించే ప్రాజెక్టును ముందకు తీసుకెళ్తున్నామని వెల్లడించారు. దాంతో పాటు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా వినుకొండలోని బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్‌కు తీసుకెళ్తామని చెప్పారు. బొల్లాపల్లి నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా పెన్నా నదీ పరివాహక ప్రాంతం బనకచర్ల వరకు నీటిని తీసుకెళ్తామని వివరించారు.
ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు - నేటి షెడ్యూల్:
ఇవాళ ఢిల్లీలో జరిగే హిందూస్తాన్ టైమ్స్ వందేళ్ల వార్షికోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ పాల్గొనున్నారు. అక్కడ నుంచి ముంబాయి వెళ్లి మహారాష్ట్రలో ఎన్‌డీఏ తరపున ఎన్నికల ప్రచారం చేస్తారు. అక్కడ నుంచి ఆదివారం సాయంత్రం అమరావతికి చేరుకుంటారు.