Amaravati : కలెక్టర్లు దర్పం ప్రదర్శించడం కాదు.. క్షేత్రస్థాయిలో పర్యటించాలి : సీఎం చంద్రబాబు
Amaravati : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
కలెక్టర్ అంటే దర్బారు, దర్పము కాదు.. ప్రజల్లో మనిషి అయి.. ప్రగతి మనసుతో ఆలోచించి.. తన పదవీకాలంలో ఆ జిల్లాపై చెరగని ముద్ర వేయాలి.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో ఒకటో రెండో కలెక్టర్స్ కాన్ఫరెన్స్‌లు జరిగాయన్నారు. అది కూడా ప్రజావేదిక కూల్చటం లాంటి కక్షసాధింపు చర్యలకు ఉపయోగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
10 నెలల్లో 3 కాన్ఫరెన్స్‌లు..
'దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పింఛన్లు రెట్టింపు చేసి అన్ని వర్గాలకు అందిస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే మూడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్‌లు పెట్టి, ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, ప్రజల కోసం తపిస్తూ అందరం పని చేస్తున్నాం. ఏప్రిల్ తొలివారంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. ఉపాధ్యాయ ఉద్యోగాలు 80 శాతం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే భర్తీ చేశాం. పారదర్శకంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాం. మెగా డీఎస్సీని పకడ్బందీగా నిర్వహించాలి. జూన్‌లో పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టింగులు ఇస్తాం' అని చంద్రబాబు స్పష్టం చేశారు.
పారదర్శకంగా పథకాలు..
'ప్రతి సంక్షేమ పథకం పారదర్శకంగా అమలు చేయాలి. ఆయా లబ్ధిదారులకు పథకాలు గౌరవంగా అందించాల్సిన బాధ్యత కలెక్టర్ నుంచి చిట్టచివరి సిబ్బంది వరకు ఉంది. కేంద్రం సహకారంతో పోలవరం త్వరలో పూర్తవుతుంది. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అమరావతి రాజధాని పనులు మొదలయ్యాయి. ప్రగతి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలి. ప్రజలకు ఆమోదయోగ్యంగా అధికారులు పనిచేయాలి. కలెక్టర్లు అంటే దర్పం ప్రదర్శించడం కాదు' అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
సంక్షేమం.. అభివృద్ధి..
'ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ఒక్కో నాయకుడి పాలన ఒక్కోలా ఉంటుంది. కొందరు అభివృద్ధి చేస్తే.. మరికొందరు నాశనం చేస్తారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు హామీఇచ్చాం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన మా విధానం. సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదు. సంక్షేమం అమలు చేయాలంటే అభివృద్ధి జరగాలి' అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
లక్ష్యానికి అనుగుణంగా..
'రాష్ట్రంలో 95 శాతం గుంతలు లేని రోడ్లుగా తీర్చిదిద్దాం. రాయితీపై సోలార్ రూఫ్ టాప్‌లు ఏర్పాటు చేయడం ద్వారా ఉచిత విద్యుత్ అందించడం, మిగులు విద్యుత్తు కొనుగోలు చేయడం అనే గొప్ప లక్ష్యం నెరవేరుతుంది. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలి. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఏ అధికారి వ్యవహరించొద్దు' అని చంద్రబాబు స్పష్టం చేశారు.
సంబంధిత కథనం