AP Assembly : ఎవరైనా భూమిని ఆక్రమిస్తే ఇక బయట తిరగలేరు.. చంద్రబాబు మాస్ వార్నింగ్
AP Assembly : ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. గంజాయి, భూ ఆక్రమణలు, ఫ్యాక్షన్, రౌడీయిజం, శాంతిభద్రతల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా భూమిని ఆక్రమిస్తే ఇక బయట తిరగలేరని చంద్రబాబు స్పష్టం చేశారు.
శాంతి భద్రతలు సరిగా లేకుంటే అభివృద్ధి అసాధ్యమని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో మత గొడవలు, రాయలసీమలో ఫ్యాక్షన్, విజయవాడలో రౌడీలు ఉండేవారని వ్యాఖ్యానించారు. రౌడీలు, ఫ్యాక్షనిస్టులను ఉక్కుపాదంతో అణచివేశామన్న సీఎం.. గంజాయి సహా అనేక సమస్యలు ఇప్పుడు వారసత్వంగా వచ్చాయని చెప్పారు.
'దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా.. వాటి మూలాలు విశాఖలో ఉండేవి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే.. గంజాయి భయంకరంగా తయారైంది. ప్రతి నేరం వెనుక గంజాయి బ్యాచ్ ఉంటోంది. ఇది చాలా ప్రమాదకరం. అందుకే కఠినంగా వ్యవహరిస్తున్నాం. గంజాయి నిర్మూళన దిశగా అడుగులు వేస్తున్నాం. గంజాయి స్మగ్లింగ్ కట్టడికి స్పష్టమైన ఆదేశాలిచ్చాం' అని సీఎం చంద్రబాబు వివరించారు.
'ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూ ఆక్రమణలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశాం. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024 పేరుతో కఠిన చట్టం. ఎవరైనా భూమిని ఆక్రమిస్తే ఇక బయట తిరగలేరు. నిందితులకు ఆరు నెలల్లోనే శిక్ష పడేలా చేస్తాం. భూ ఆక్రమణలపై డీఎస్పీ స్థాయి అధికారి విచారిస్తారు. పీడీ యాక్ట్‌కు కూడా పదును పెడుతున్నాం' అని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు.
'టీడీపీ సర్కారు 2014-19 కాలంలో 53 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. జగన్ వచ్చాక 27 కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. వోల్టాస్, మైక్రోమ్యాక్స్, జీఎం మ్యాడ్యూల్ వంటి కంపెనీలు వెళ్లిపోయాయి. అతి ఎక్కువ పన్ను చెల్లించే ప్రఖ్యాత కంపెనీ అమరరాజాపై జగన్ సర్కారు వేధింపులు పరాకాష్టకు చేరడంతో.. వారు పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయారు. హెచ్‌సీఎల్ కంపెనీలో ట్రాన్స్ పోర్టు కాంట్రాక్టు కోసం శ్రీకాళహస్తి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే బియ్యం మధుసూదనరెడ్డి.. ఆ కంపెనీ ఉన్నతోద్యోగిని భోజనానికి పిలిచి బంధించాడు' అని మంత్రి లోకేష్ అసెంబ్లీలో వివరించారు.
'కేంద్ర ప్రభుత్వం మేకింగ్ ఇండియా అద్భుత ఫలితాలు ఇస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం కృషితో దేశంలోనే టీవీలలో 40 శాతం, ఏసీలలో 50 శాతం ఏపీ నుంచి తయారు కావడం మన రాష్ట్రానికి గర్వకారణం' అని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.
మోదీ తరహాలో..
ప్రధాని మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ తరహాలోనే.. చంద్రబాబు కూడా ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు. సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో చంద్రబాబు హయాంలో 1995-2004 మధ్య డయల్ యువర్ సీఎం నిర్వహించారు. తాజాగా.. ఆడియో, వీడియో విధానంలో దీన్ని నిర్వహించే అవకాశం ఉంది.