రాష్ట్రంలోని విద్యార్ధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ప్రతీ విద్యార్ధికి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇచ్చేలా సరికొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఎలాంటి పరిమితి లేకుండా, ఎంతమంది విద్యార్ధులైనా చదువుకునే వీలుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అలాగే దేశంలో ఐఐటీ, ఐఐఎం నీట్ వంటి ఉన్నత విద్య చదవాలనుకునే వారికి కూడా ఈ పథకం వర్తింప చేయాలని సూచించారు. ఇందులో 4 శాతం వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వడంతో పాటు, దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని సీఎం చెప్పారు. 14 ఏళ్లలో రుణాన్ని చెల్లించుకునే వెసులుబాటు ఇస్తామని అన్నారు.
మరోవైపు బీసీ విద్యార్ధులు ఐఐటీ, నీట్‌లో కోచింగ్ కోసం రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ సంక్షేమంపై మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, ఫరూఖ్, సవిత, ఆయా శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని హాస్టళ్లను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చేందుకు అధ్యయనం చేయాలని, దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతీ పేద విద్యార్ధికి నాణ్యమైన విద్య అందించాలనేది తన సంకల్పమని… అధికారులు ఇందుకోసం కృషి చేయాలని సీఎం చెప్పారు. హాస్టళ్లను రెసిడెన్షియల్ పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించడం సాధ్యమవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనతో పాటు ఏడాదిలోగా మరమ్మతులు పూర్తి చేయాలన్నారు.
తల్లికి వందనం పథకం నుంచి స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్‌కు నిధులు ఇస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందన్నారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించాల్సిన రూ.1,700 కోట్లు కాలేజీలకు చెల్లించకపోవడంతో విద్యార్ధులే రూ.900 కోట్లు చెల్లించారని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఇంకా యాజమాన్యాలకు సుమారు రూ.800 కోట్ల బకాయిలు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం చెల్లించాల్సి ఉందని వివరించారు.
బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే విద్యార్థుల్లో ఈ ఏడాది ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారిలో కొందరు విద్యార్థులు సమీక్షా సమావేశానికి ముందు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని అభినందించిన సీఎం చంద్రబాబు..ఉన్నత విద్యలో మరింత రాణించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
సంబంధిత కథనం