AP Pensions : జూలై 1 నుంచి ఇంటి వద్దకే 'పెన్షన్'... పెంపుతో కలిపి రూ.7 వేలు పంపిణీ - సీఎం చంద్రబాబు
CM Chandrababu On Pensions : ఎన్టీఆర్ భరోసా పేరుతో లబ్ధిదారుల ఇంటి వద్దకే సామాజిక పింఛన్లు వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. - జులై 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభమవుతుందని ప్రకటించారు.
CM Chandrababu On Pensions : రాష్ట్రంలోని పింఛన్ దారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.
మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని చంద్రబాబు చెప్పారు. ఏ ఆశలు, ఆకాంక్షలతో గెలిపించారో.. వాటిని నెరవేర్చడమే తక్షణ కర్తవ్యమన్నారు.
ఇంటి వద్దకే పెన్షన్….
మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ ను ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. దివ్యాంగులకు పింఛన్ రూ.6 వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్న ఆయన.. జులై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఆర్థిక సమస్యలున్నా.. ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకున్నామని చంద్రబాబు గుర్తు చేశారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడుతుందని అన్నారు. నాటి అధికార పక్షం పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టిందన్నారు.
“ఎన్నికల సమయంలో 3 నెలలు మీ కష్టాలు చూసి చలించిపోయా. మండుటెండలో, వడగాడ్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూశా. ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తానని మాట ఇచ్చా. ఏప్రిల్, మే, జూన్ నెలలకూ పెంపును వర్తింపచేసి మీకు అందిస్తున్నా. మూడు నెలలకు పెంచిన రూ.3 వేలు, జులై రూ.4 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు అందించనున్నాం” అని చంద్రబాబు ప్రకటించారు.
పింఛన్ విధానానికి ఆద్యుడైన ఎన్టీఆర్ పేరును పింఛన్ల కార్యక్రమానికి పెట్టామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ‘ఎన్టీఆర్ భరోసా’ పేరుతో ఇకపై మీ ఇంటి వద్ద సామాజిక పింఛన్ల పంపిణీ ఉంటుందన్నారు. ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని లేఖలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
సీఎస్ ఆదేశాలు….
ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పథకం అమల్లో బాగంగా నూతన ప్రభుత్వం పెంచి సామాజిక భద్రతా ఫించన్లను జూలై 1 ఫించనుదారుల ఇంటి వద్దే పంపిణీకి పటిష్టమైన ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా నున్న 65,18,496 మంది ఫించనుదారులు అందరికీ పెంచిన ఫించన్లను ఒక్క రోజులోనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించాలన్నారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించి ఫించన్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు.
ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒకటవ కేటగిరీలోని వృద్దులు, వితంతువులు తదితర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి ఫించను సొమ్మును రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచిన నేపథ్యంలో జూలై 1 వ తేదీన రూ.4 వేలతో పాటు ఏఫ్రిల్, మే మరియు జూన్ మాసాలకు సంబందించి పెరిగి ఫించను సొమ్ము నెలకు రూ.1,000/- ల చొప్పు మూడు మాసాల ఎరియర్స్ కలుపుకుని మొత్తం రూ.7,000/-లను పంపిణీ చేయాలని ఆదేశించారు.