బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సముద్రంలో కలిసే జలాలను రెండు రాష్ట్రాలూ కలిసి వాడుకుందామన్నారు. గోదావరిలోని నీళ్లను ఇరు రాష్ట్రాలు వాడుతున్నాయని… పోలవరం తప్ప మిగతావన్నీ అనుమతి రాని ప్రాజెక్టులే అని వ్యాఖ్యానించారు.
“విభజన చట్టంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. గోదావరి ప్రవాహంలో చిట్టచివరి రాష్ట్రంగా వచ్చిన నీటిని మరో బేసిన్ కు తరలిస్తున్నాం. గతంలో కృష్ణా బ్యారేజ్ పై ఇరు రాష్ట్రాల సిబ్బంది గొడవపడ్డారు. గవర్నర్ వద్ద కూర్చొని గతంలో సమస్య పరిష్కరించుకున్నాం. కృష్ణా లో తక్కువ ఉన్న నీటిపై గొడవ పడితే లాభం లేదు. ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులను అలాగే కొనసాగిద్దాం. కొత్త ట్రిబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్లాలి” అని చంద్రబాబు తెలిపారు.
“ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేనే చాలా ప్రాజెక్టులు మొదలుపెట్టాను. దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టులు నేనే మొదలు పెట్టాను. ఎల్లంపల్లి ప్రాజెక్టుపై వివాదం వస్తే అసెంబ్లీలో పోరాడాం. కాళేశ్వరం గురించి ఎప్పుడూ నేను అభ్యంతరం చెప్పలేదు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి వాడుకునే నీటిపై ఎందుకు వివాదాలు పెట్టుకోవాలి. సముద్రంలో కలిసే నీటి వాడకంపై చట్టబద్ధత కావాలంటే కేంద్రంతో చర్చిద్దాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.
“సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంతవరకు సమంజసం? రెండు రాష్ట్రాల జల వివాదాల వల్ల ఎలాంటి లాభం లేదు. వివాదం సృష్టిస్తే ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది. ఈ అంశంపై పోరాటాలు అక్కర్లేదు. ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి. ఎవరు వద్దన్నారు” అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కామెంట్స్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు నెంబర్ వన్ గా ఉండాలన్నదే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు.