రాబోయే రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు వస్తాయి.. సీఆర్డీఏ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు!-cm chandrababu inaugurates crda office in amaravati and thanks to farmers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  రాబోయే రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు వస్తాయి.. సీఆర్డీఏ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు!

రాబోయే రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు వస్తాయి.. సీఆర్డీఏ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు!

Anand Sai HT Telugu

రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశాన్ని కూడా చెప్పకుండా విభజన చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం స్థలం కూడా లేని పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేశారన్నారు.

సీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబు

సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ పథకంలో పాల్గొన్న రైతులు ఆయనతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాజధాని అమరావతి ప్రాంత రైతుల త్యాగాలను ఎన్నడూ మరువనని చెప్పారు.

'రైతుల అవస్థలు చూశాను. రోడ్డెక్కి ఉద్యమాలు చేశారు. రాజధాని ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మెుదటగా సీఆర్డీఏ భవనం ప్రారంభమైంది. మెుదటిసారిగా ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన చరిత్ర అమరావతి రైతులది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు వస్తాయి.' అని చంద్రబాబు అన్నారు.

రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని కూడా లేని పరిస్థితి ఉందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. రాజధాని ఎక్కడ అనే విషయం చెప్పకుండానే అప్పటి కేంద్ర ప్రభుత్వం విభజన చేసిందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడాలని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. విజయవాడ-గుంటూరు నడుమ రాజధాని ఉంటే బాగుంటుందని నిర్ణయించామన్నారు.

రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడానికి అన్నదాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారన్నారు. ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద మెుత్తంలో భూ సేకరణ జరిగింది అమరావతిలో మాత్రమేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. గతంలో హైటెక్ సిటీ నిర్మించేటప్పుడు.. తన విజన్ చెబితే.. అవహేళన చేశారన్నారు. హైదరాబాద్‌లో ఐదు వేల ఎకరాల్లో ఎయిర్ పోర్ట్ నిర్మించామన్నారు. ఎయిర్‌పోర్టుకు భూమి ఇవ్వాలని చెబితే రైతులు వెంటనే ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

'రాష్ట్రం మధ్యలో రాజధాని పెడితే అందరికీ బాగుంటుందని ఏర్పాటు చేశాం. గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మిస్తున్నాం. రాజధాని నిర్మాణానికి భూమి కావాలని.. ప్రణాళికలకు అనుగుణంగా రాజధాని నిర్మించగలరా అని అనుమానపడ్డారు. సైబరాబాద్ నిర్మించిన అనుభవంతో అమరావతి నిర్మాణం ప్రారంభించాం. భూమి కోసం ఎదురు చూస్తున్న సమయంలో అమరావతి రైతులు తనకు దారి చూపారు.' అని చంద్రబాబు అన్నారు.

గతంలో జరిగిన తప్పుకు మీరు, నేను, రాష్ట్ర ప్రజలు ఎంత అనుభవించారో చూశారని చంద్రబాబు అన్నారు. ఇక ఎన్డీఏ ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలన్నారు. అమరావతికి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని పార్లమెంట్ మట్టి యమునా నది నీరు తెచ్చారని గుర్తు చేశారు. అందుకే అమరావతి నిలిచిందన్నారు. రైతులను తాను మరచిపోనని, మరిచిపోతే త్యాగాన్ని మరిచినట్టేనని వ్యాఖ్యానించారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.