కొందరు కావాలనే యూరియాను దారి మళ్లిస్తున్నారు.. దుష్ప్రచారం చేస్తే జైలులో వేస్తాం : చంద్రబాబు-cm chandrababu gives clarity on urea shortage in ap and fires on ysrcp leaders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కొందరు కావాలనే యూరియాను దారి మళ్లిస్తున్నారు.. దుష్ప్రచారం చేస్తే జైలులో వేస్తాం : చంద్రబాబు

కొందరు కావాలనే యూరియాను దారి మళ్లిస్తున్నారు.. దుష్ప్రచారం చేస్తే జైలులో వేస్తాం : చంద్రబాబు

Anand Sai HT Telugu

కొందరు కావాలనే యూరియాను దారి మళ్లిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు.

సీఎం చంద్రబాబు

ఏపీలోని ప్రతి జిల్లాలోనూ ఎరువులు అందుబాటులో ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. కొందరు కావాలనే ఉద్దేశంతోనే యూరియాను దారి మళ్లిస్తున్నట్టుగా చెప్పారు. ఎరువు లభ్యతపై సచివాలయంలో మీడియాతో మాట్లాడిన సీఎం.. కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియాను దారి మళ్లించిన వారిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. రూ.3 కోట్ల విలువైన యూరియాను స్వాధీనం చేసుకున్నట్టుగా పేర్కొన్నారు. ఫేక్ పార్టీ, నేరాలను నమ్ముకుని దందాలు చేసే పార్టీ ఎరువుల మీద తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు.

రైతులకు సరైన సమయంలో యూరియా, ఎరువులను సరఫరా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు సీఎం. యూరియాకు సంబంధించి ఎవరూ ఆందోళన చెంద్దవద్దన్నారు. రాష్ట్రంలో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. అతి త్వరలో 2.71 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. నాలుగేళ్లలో సగటున 36.71 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వాడాలనుకున్నామన్నారు.

పదిరోజుల్లో చూసుకుంటే.. 25 వేల మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేశామని వెల్లడించారు చంద్రబాబు. ఇంకో పది రోజుల్లో 44,580 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని ప్రకటించారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని ఆదేశించాలమని స్పష్టం చేశారు. ఆధార్‌తో ఎవరికి యూరియా ఎంతో కావాలో పంపిణీ చేస్తామన్నారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

'కృష్ణా జిల్లాలో యూరియా లారీని వైసీపీ నేత అడ్డుకుని వివాదం చేశారు. రైతుల ముసుగులో వైసీరీ కార్యకర్తలు రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు. యూరియా కొరత ఉందని చెప్తే అక్కడను నేనే వెళ్తా. నిజయంగా యూరియా కొరత ఉంటే అధికారులపై చర్యలు తీసుకుంటాం. యూరియా కొరత లేకున్నా దుష్ప్రచారం చేస్తే జైలులో వేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారని ఎవరు చెప్పారు? కొన్ని సర్వీసులను ఔట్ సోర్సింగ్ చేస్తారు. స్టీల్ ప్లాంట్ కు రూ.12 వేల కోట్ల నిధులు వచ్చాయి. ఫేక్ రాజకీయాలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టం.' అని చంద్రబాబు అన్నారు.

మీ అరాచకాలు తట్టుకోలేకనే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని సీఎం చంద్రబాబు అన్నారు. గుండెపోటు, కోడికత్తి, గులకరాయి అంటూ డ్రామాలు ఆడి ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూశారని విమర్శించారు. బ్లాక్ మెయిల్ రాజీయాలకు రాష్ట్రంలో కాలం చెల్లిందన్నారు. ప్రజా సమస్యలపై శ్రద్ధ ఉంటే దానికి తగ్గట్టుగా పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఫేక్ పార్టీ, నేరాలను నమ్ముకున్న పార్టీ విషప్రచారం చేస్తోందన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.