AP Nominated Post 2024 : రెండో దఫా నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై చంద్రబాబు ఫోకస్.. ఈసారి డబుల్ ధమాకా!-cm chandrababu focus is on filling nominated posts for the second time in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Nominated Post 2024 : రెండో దఫా నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై చంద్రబాబు ఫోకస్.. ఈసారి డబుల్ ధమాకా!

AP Nominated Post 2024 : రెండో దఫా నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై చంద్రబాబు ఫోకస్.. ఈసారి డబుల్ ధమాకా!

AP Nominated Post 2024 : ఏపీలో మరోసారి నామినేటెడ్ పోస్టులపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఒక లిస్టును ప్రకటించిన చంద్రబాబు.. రెండో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. త్వరలోనే రెండో లిస్టును చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. దీని కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో రెండో దఫా నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. త్వరలోనే ఈ జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని కూటమి నేతలు చెబుతున్నారు. తాజాగా చంద్రబాబు శుక్రవారం ఉదయం దాదాపు 3 గంటలపాటు నామినేటెడ్‌ పదవులపై చర్చించారు. మొదటి దశలో 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లతోపాటు, ఆర్టీసీకి వైస్‌ ఛైర్మన్‌నూ నియమించారు.

రెండో జాబితాలో దానికి రెట్టింపు సంఖ్యలో పోస్టులు భర్తీ చేస్తారని కూటమి నేతలు ఆశిస్తున్నారు. కూటమి విజయం కోసం కష్టపడి పనిచేసినవారికి పదవులు ఇవ్వాలన్న ఉద్దేశంతో చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది టీడీపీ నేతలతో మాట్లాడినట్టు తెలిసింది. మిత్రపక్షాలతోనూ చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు.

నామినేటెడ్‌ పదవుల్లో మిత్రపక్షాలకు 20 శాతం పదవులు కేటాయించాలనే అంగీకారం ఇప్పటికే కుదిరింది. దాని ప్రకారమే రెండో దశ పదవుల నియామకం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇటీవల ఆర్టీసీ, పౌరసరఫరాలు, ఏపీఐఐసీ, వక్ఫ్‌ బోర్డు వంటి 20 కీలక కార్పొరేషన్లకు ఛైర్మన్‌లతో పాటు ఆర్టీసీకి వైస్‌ ఛైర్మన్‌ను కూడా నియమించింది. ఏడు కార్పొరేషన్లలో 64 మంది సభ్యులకు చోటు కల్పించింది. మిగతా 13 కార్పొరేషన్లకు ప్రస్తుతానికి ఛైర్మన్లను మాత్రమే ప్రకటించింది.

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల పంపకానికి అనుసరించిన విధానాన్నే.. నామినేటెండ్ పోస్టుల భర్తీలోనూ వర్తింపజేసింది. టీడీపీ నుంచి 16 మందిని ఛైర్మన్లుగా, 53 మందిని సభ్యులుగా, జనసేన నుంచి ముగ్గురిని ఛైర్మన్లుగా, 9 మందిని సభ్యులుగా, బీజేపీ నుంచి ఒకరిని ఛైర్మన్‌గా, ఐదుగురిని సభ్యులుగా నియమించారు. ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌ పోస్టు టీడీపీకు దక్కింది.

ఆశావహుల సంఖ్య ఎక్కువే..

మొదటి విడతలో చాలామంది నామినేటెడ్ పోస్టులను ఆశించారు. కానీ.. దక్కలేదు. దీంతో రెండో విడతలో అయినా తమకు అవకాశం ఇవ్వాలని కీలక నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. విజయవాడ కేంద్రంగా లాబీయింగ్ స్టార్ట్ చేశారు. ఈ దఫాలో.. కూటమి నేతల కోసం సీట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అలాగే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉందని సమచారం.