జీరో పావర్టీ పీ4 లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది ఆగస్ట్ 15 నాటికి రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన మార్గదర్శి రిజిస్ట్రేషన్, దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు.
నాడు ఆర్థిక సంస్కరణల తర్వాత చేపట్టిన పీపీపీ విధానానికి కొనసాగింపుగానే నేడు పీ4 విధానం తీసుకువచ్చామని అన్నారు. బుధవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జీరో పావర్టీ పీ4పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి... స్మార్ట్ ఏపీ ఫౌండేషన్‌ను స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్‌గా మార్చాలని నిర్దేశించారు. అమరావతి పీ4కి కేస్ స్టడీగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
రాజధాని నిర్మాణంలో 29 వేల మంది రైతులను భాగస్వాములు చేయడం ద్వారా వారికి సంపద సృష్టి జరిగేలా చేశామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ప్రతి బంగారు కుటుంబాన్ని మార్గదర్శి దత్తత తీసుకుని వారి ఉన్నతికి కృషి చేసేలా చూడాలన్నారు. ప్రతి 10 రోజులకు ఒకసారి పీ4 పురోగతిని సమీక్షిస్తానని ముఖ్యమంత్రి అన్నారు. మరోవైపు అధికారులు రూపొందించిన పీ4 లోగో డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు.
పీ4 కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించేందుకు మిలాప్, ప్రాజెక్ట్ డీప్, రంగ్ దే, భార్గో వంటి సంస్థలు భాగస్వాములుగా సహకారం అందించేందుకు ముందుకువచ్చినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో 19,15,771 బంగారు కుటుంబాలుగా నమోదు కాగా... వీరిలో ఇప్పటివరకు 70,272 కుటంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని వివరించారు. వీరిలో అత్యధికంగా 26,340 బీసీ కుటుంబాలు, 14,024 ఎస్సీ కుటుంబాలు, 13,115 ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని తెలిపారు.