Chandrababu Unhappy: తిరుపతి వెళ్లినా స్వామి దర్శనం కాకుండానే వెనక్కి వచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎందుకంటే?
Chandrababu Unhappy: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి వెళ్లినా స్వామి వారి దర్శనం చేసుకోకుండానే ఇంటికి తిరిగి వచ్చేశారు. తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో గురువారం తిరుపతిలో పర్యటించిన సీఎం రాత్రికి తిరిగి అమరావతి వెళ్లిపోయారు.
Chandrababu Unhappy: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం చేసుకోకుండానే ఉండవల్లికి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని వైకుంఠ ఏకాదశి నాడు ముఖ్యమంత్రి సతీసమేతంగా దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వైకుంఠ ఏకాదశ సందర్భంగా భక్తులను దర్శనాలకు అనుమతించ ముందే ముఖ్యమంత్రి స్వామి వారికి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అయితే ఈ ఏడాది తిరుపతికి వచ్చినా ముఖ‌్యమంత్రి తిరుమలకు వెళ్లకుండానే తిరిగి వెళ్లిపోయారు.
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కు వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం, 40మందికి పైగా గాయాల పాలవడం తెలిసిందే. మృతి చెందిన వారి కుటుంబాలను ఆస్పత్రి మార్చురీ వద్ద ముఖ్యమంత్రి పరామర్శించారు. మృతదేహాల వద్దకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర‌్శించడంతో తిరుమలకు వెళ్ల కూడదని వేద పండితులు సూచించడంతో ఆయన తిరుపతిలోనే సమీక్షలు నిర్వహించి వెనక్కి వెళ్లిపోయారు.
ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ఏడాది వైకుంఠ ఏకాదశిలో పాల్గొనలేకపోవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తికి గురయ్యారు. తిరుమల వేంకటేశ్వరుడిపై సీఎం చంద్రబాబుకు అపార భక్తి విశ్వాసాలున్నాయి. అలిపిరిలో బాంబు దాడి నుంచి ప్రాణాలతో బయటపడటం దేవదేవుడి దయతోనే అని తరచూ చెబుతుంటారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినాన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలని షెడ్యూల్ రూపొందించుకున్నారు. 9వ తేదీ గురువారం సాయంత్రమే కుటుంబ సభ్యులతో కలిసి సీఎం తిరుమల చేరుకోవాల్సి ఉంది. అనూహ్యంగా బుధవారం రాత్రి జరిగిన ఘటనతో సీఎం పర్యటన మొత్తం మారిపోయింది.
గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు తిరుపతిలో ఉండి బాధితుల్ని పరామర్శించడంతో పాటు ఘటనపై సమీక్షలు నిర్వహించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ఏడాది వైకుంఠ ఏకాదశిలో పాల్గొనలేకపోవడం ముఖ్యమంత్రిని అసంతృప్తి గురైనట్టు తెలుస్తోంది.
తిరుమల తొక్కిసలాటలో గాయపడిన దాదాపు 50మంది క్షతగాత్రులు, వారి బంధువులకు టీటీడీ శుక్రవారం ఉదయం ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం చేయించింది.
ముఖ్యమంత్రి నేటి కార్యక్రమాలు..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు గుంటూరులో నరెడ్కో ప్రాపర్టీ షో కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి సచివాలయానికి చేరుకుంటారు.
సచివాలయంలో విజయవాడ వెస్ట్రన్ బైపాస్ పై అధికారులతో సమీక్ష చేస్తారు. అనంతరం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై సమీక్షిస్తారు.