రాష్ట్రం నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు కాలుష్య రహితంగా మార్చేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ ఏపీ ఉద్యమం చేపట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఉద్యమం ద్వారా 2026 జూన్ నాటికి రాష్ట్రాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తామని ఆయన వెల్లడించారు. శనివారం పల్నాడు జిల్లా మాచర్లలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
చెరువు గట్టు, పరిసర ప్రాంతాల్లో బహిరంగంగా ఉన్న చెత్తను, గట్టు వద్ద పేరుకుపోయిన వ్యర్ధాలను మున్సిపల్ కార్మికులతో కలిసి సీఎం చంద్రబాబు తొలగించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. సఫాయి కార్మికులు, వైద్య సిబ్బందితో ముఖ్యమంత్రి సంభాషించారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.52 కోట్ల విలువైన చెక్కును అందించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.
రాజకీయ ముసుగులో రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలు అధికారం ఇచ్చింది మంచి పాలన అందించడానికే కానీ ప్రజలపై దాడులు చేయడానికి కాదని అన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలవాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. చెత్తనే కాదు ..చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మాచర్ల ప్రజల ముఖాల్లో ఇవాళ ఆనందాన్ని చూస్తున్నానని… ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. పల్నాడులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోనన్న ఆయన.. జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.
పల్నాడు జీవనాడి, 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 1 లక్ష మందికి తాగునీరు అందించే వరికపుడిశెలను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం మాట్లాడుతూ "ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుడితే వాటిని పూర్తి చేసే అవకాశం భగవంతుడు నాకిచ్చాడు. వరికపుడిశెల మొదటి దశలో 1.54 టీఎంసీలు, రెండో దశలో 6.32 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. పోలవరం పనులు నేను 74 శాతం పూర్తిచేస్తే గత ఐదేళ్లలో ఒక వ్యక్తి వచ్చి దానిని ధ్వంసం చేశాడు. 2027 నాటికి పోలవరం పూర్తిచేస్తాం. రాష్ట్రంలోని జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. శ్రీకాకుళంలో ఉన్న వంశధారను, గోదావరి, కృష్ణా, రాయలసీమలో పెన్నా నదిని అనుసంధానిస్తాం. ఇప్పటికే గోదావరి కృష్ణా నదిని అనుసంధానించాం. త్వరలోనే గోదావరి వంశధారను అనుసంధానం చేసి పెన్నాను కూడా కలుపుతాం. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటాను" అని సీఎం అన్నారు.
మాచర్లను మోడల్ మున్సిపాలిటీగా తయారుచేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 50 కోట్లను అదనంగా మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా తలసరి ఆదాయంలో తక్కువగా ఉందని అన్నారు. జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కారంపొడి పలనాటి వీరారాధన ఉత్సవాలను ప్రభుత్వం తరపున నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ఫ్రీ నినాదాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. మున్సిపల్ శాఖ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి పరిశుభ్రమైన నగరాలు, గ్రామీణ ప్రాంతాల కోసం పనిచేస్తున్నారని అన్నారు. అక్టోబర్ 2 కంటే ముందుగానే గత పాలకులు వదిలేసి వెళ్లిన 85 లక్షల టన్నుల చెత్తను 100 శాతం క్లియర్ చేశామని తెలిపారు.
“సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలి. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హీ సేవా ప్రచారం నిర్వహిస్తున్నాం. పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం కోసం సఫాయి మిత్ర సురక్షిత శిబిరాలు, అలాగే సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. పట్టణ పారిశుధ్య కార్మికులకు బీమా పథకాన్ని ప్రారంభించాం. 16 విభాగాల్లో 52 రాష్ట్ర స్థాయి, 1,421 జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం చేస్తున్నాం. అక్టోబర్ 2న సఫాయి మిత్రలు, శానిటేషన్ వర్కర్లు, అగ్రస్థానంలో నిలిచిన మున్సిపాలిటీలు స్వచ్ఛ వాలంటీర్లను జిల్లాల కలెక్టర్లు సత్కరించాలి. పచ్చదనం పెంపులో ప్రతీ పౌరుడు భాగస్వామి కావాలి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.
సంబంధిత కథనం