ఖరీఫ్ పంటలను తుఫాన్ల నుంచి రక్షించుకునేలా పంటకాలాన్ని ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు కార్యాచరణ మొదలుపెట్టారు. ఇందుకు అనుగుణంగా గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాలకు ఈ ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేశారు.
మంగళవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో భూములకు కాలువల ద్వారా ఇప్పటికే నీరు విడుదల చేశామని అధికారులు తెలిపారు. జూలై మొదటివారంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు నీరు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు.
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో ప్రధానంగా వరి, కందులు, వేరుశనగ, ప్రత్తిసాగు చేస్తుండగా... వేరుశనగ, ప్రత్తి సాగు తగ్గుతూ వస్తోందని పేర్కొన్నారు. కందుల సాగుమాత్రం పెరిగిందని… వరి సాగు స్థిరంగా కొనసాగుతోందని అధికారులు చెప్పారు.
గత 20 ఏళ్లుగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ 14 తుఫాన్లను ఎదుర్కొంది. వీటిలో 5 తుఫాన్లు అక్టోబర్‌లో, 6 తుఫాన్లు నవంబర్‌లో, 3 తుఫాన్లు డిసెంబర్‌లో రాష్ట్రంపై ప్రభావం చూపాయి. అక్టోబర్‌లో వచ్చే తుఫాన్లు ఎక్కువగా ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాలకు నష్టం కలిగించాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తుఫాన్ల ప్రభావం తగ్గేలా ఖరీఫ్ సాగు ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.
365 రోజులు సాగుభూములు పచ్చగా ఉండేలా చూడాలని... ఇందుకోసం 3 పంటల విధానం తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు… అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లోని 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేయాలని చెప్పారు. అనంతపురం వంటి జిల్లాల్లో 365 రోజుల్లో కేవలం 4 నెలలే పంటలు సాగు చేసి, 8 నెలల పాటు భూములు ఖాళీగా వదిలేస్తున్నారని...దీనివల్ల భూసారం దెబ్బతింటోందని ప్రస్తావించారు. అలాకాకుండా మిగిలిన 8 నెలలు కూడా ఏదో ఒక పంట సాగు చేసే పరిస్థితులు కల్పించాలని చెప్పారు.
వచ్చే వేసవిలో జలవనరుల లభ్యత ఉన్న 141 మండలాల్లోనూ పంటల సాగు జరిగేలా రైతుల్ని సన్నద్ధం చేయాలన్నారు. ఇందులో 19 మండలాలు రిజర్వాయర్లు, 57 మండలాలు చెరువులు, 65 మండలాలు భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్నాయని... వీటిని వినియోగించుకుని దిగుబడులు సాధించాలన్నారు. అలాగే వరిలో అధిక డిమాండ్ ఉన్న సన్నరకాలను పండిచేలా రైతులను ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు.
హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు పర్చూరు ఏఎంసీలో ప్రారంభించామని, దీనిపై రైతుల్లో సంతృప్తి వ్యక్తమైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. హెచ్డీ బర్లీ స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కోకో, మామిడి కొనుగోళ్ల వివరాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా కొత్తగా వ్యవసాయ శాఖకు సంబంధించి 3 సేవలు అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు.
ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని సీఎం చంద్రబాబు సూచించారు. భూసారాన్ని కాపాడేందుకు కృషి చేయాలన్నారు. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎరువులు, పురుగుమందుల వినియోగంపై తాజా సమాచారం ఉండాలన్నారు. రాష్ట్రంలో గత ఏడాది పంటకాలంలో 39 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించగా, ఈ ఏడాది దానిని 35 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.