AP Crime News : విద్యార్థినిపై లైంగిక వేధింపులు - స్కూల్ హెచ్ఎంకు దేహశుద్ధి, సస్పెండ్ చేసిన డీఈవో-class 5 student sexually assaulted by school principal in kakinada district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Crime News : విద్యార్థినిపై లైంగిక వేధింపులు - స్కూల్ హెచ్ఎంకు దేహశుద్ధి, సస్పెండ్ చేసిన డీఈవో

AP Crime News : విద్యార్థినిపై లైంగిక వేధింపులు - స్కూల్ హెచ్ఎంకు దేహశుద్ధి, సస్పెండ్ చేసిన డీఈవో

HT Telugu Desk HT Telugu
Jan 30, 2025 10:37 AM IST

ఐదో త‌ర‌గ‌తి విద్యార్థినిపై ప్ర‌ధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని క‌ర‌ప మండ‌లంలో జరిగింది. తల్లితో పాటు బంధువులకు విషయం తెలియటంతో హెచ్ఎంకు దేహాశుద్ధి చేశారు. విచారణ జరిపిన డీఈవో హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు వేశారు.

ఐదో త‌ర‌గ‌తి విద్యార్థినిపై లైంగిక వేధింపులు (representative image )
ఐదో త‌ర‌గ‌తి విద్యార్థినిపై లైంగిక వేధింపులు (representative image ) (image source unsplash.com)

కాకినాడ జిల్లాలో ఘోర‌ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఐదో త‌ర‌గ‌తి విద్యార్థినిపై ప్ర‌ధానోపాధ్యాయుడు లైంగిక వేధింపుల‌కు దిగాడు. బాలిక త‌ల్లికి విష‌యం తెలియ‌డంతో హెచ్ఎంను నిలదీసింది. బాలిక బంధువులు దేహ‌శుద్ధి చేశారు.

తొలుత ఒక విద్యార్థిని లైంగిక వేధింపులు చేశార‌ని బ‌య‌ట‌కు వ‌చ్చింది. డీఈవో, ఎంఈవో విచార‌ణ‌లో ఐదుగురు విద్యార్థినీలు లిఖిత‌పూర్వ‌క ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కీచ‌క ప్ర‌ధానోపాధ్యాయుడిని జిల్లా విద్యా శాఖ అధికారి సస్పెండ్ చేశారు. విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఈ ఘ‌ట‌న కాకినాడ జిల్లాలోని క‌ర‌ప మండ‌లంలో ఒక గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… క‌ర‌ప మండ‌లంలోని ఒక గ్రామంలో మండ‌ల ప‌రిష‌త్ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో వీఎస్ రామారావు ప్ర‌ధానోపాధ్యాయుడిగా ప‌ని చేస్తున్నాడు. ఆయ‌న గ‌త కొంత కాలంగా ఐదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థిని లైంగిక వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. బాలిక త‌న త‌ల్లికి చెప్ప‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అయితే బ‌య‌ట‌కు మాత్రం పొక్క‌లేదు.

రాజీ ప్రయత్నాలు…!

ఈనెల 3 తేదీన బాలిక కుటుంబ స‌భ్యుల‌ను స్కూలుకు పిలిపించుకుని ఒక నాయకుడు రాజీ కుదిర్చాడు. ప్ర‌ధానోపాధ్యాయుడిని స్కూలు నుంచి పంపించేయాల‌ని బాలిక బంధువులు స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలో బాలిక త‌ల్లి ప్ర‌ధానోపాధ్యాయుడు రామారావు ముఖంపై ఉమ్మేసింది. బాలిక బంధువులు ఆయ‌న‌కు దేహ‌శుద్ధి చేశారు. అప్ప‌టి నుంచి నెల రోజుల పాటు ప్ర‌ధానోపాధ్యాయుడు సెల‌వు పెట్టి స్కూల్‌కు వెళ్ల‌టం లేదు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే అభంశుభం తెలియ‌ని చిన్నారి విద్యార్థినిపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డటంతో గ్రామ‌స్తులు మండిపోతున్నారు.

సస్పెన్షన్ వేటు….

ఈ ఘ‌ట‌న బుధ‌వారం బ‌య‌ట‌కు పొక్క‌డంతో జిల్లా విద్యా శాఖ అధికారి పిల్లి ర‌మేష్, మండ‌ల విద్యా శాఖ అధికారి కె.బులికృష్ణ‌వేణి, ఎస్ఐ సునీత‌, ఎంపీడీవో అనుప‌మ పాఠ‌శాల‌కు వెళ్లి విచార‌ణ జ‌రిపారు. ప్ర‌ధానోపాధ్యాయుడు త‌మ‌ను లైంగికంగా వేధిస్తున్నార‌ని ఐదుగురు విద్యార్థినిలు లిఖిత‌పూర్వ‌క ఫిర్యాదు చేశారు.

దీంతో ప్ర‌ధానోపాధ్యాయుడు వీఎస్ రామారావును స‌స్పెండ్ చేస్తూ డీఈవో పిల్లి రామేష్ ఉత్త‌ర్వులు ఇచ్చారు. ప్ర‌ధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు న‌మోదు చేశారు. కీచ‌క ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ‌స్తులు డిమాండ్ చేస్తున్నారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం