Triple Murder: కాకినాడలో కుటుంబ కలహాలతో ఘర్షణ, ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య
Triple Murder: ఊరంతా దీపావళి పండుగ హడావుడిలో ఉన్న సమయంలో జరిగిన హత్యలు ఊరి జనాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. కాకినాడ జిల్లాలో గురువారం రాత్రి కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు.
Triple Murder: కాకినాడ జిల్లాలో దీపావళి పండుగ రోజు దారుణం చోటు చేసుకుంది. ఊరంతా పండుగ హడావుడిలో ఉన్న సమయంలో పాతకక్షలు భగ్గుమన్నాయి. కాజులూరు మండలం శలపాక గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ కాస్త కత్తులతో దాడి చేసుకునే వరకు వెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. పాత కక్షలతో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారని చెబుతున్నా పథకం ప్రకారమే ఓ కుటుంబంపై దాడి చేసినట్టు బాధితులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు బత్తుల రమేశ్, బత్తుల చిన్ని, బత్తుల రాజుగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.
ఇరుగు పొరుగున ఉండే రెండు కుటుంబాల్లో ఓ మహిళ కారణంగా వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. ఘర్షణ జరిగిన సమయంలో గ్రామంలో కరెంటు పోవడంతో ఏమి జరిగిందో స్థానికులు గుర్తించలేకపోయినట్టు చెబుతున్నారు. హత్యల తర్వాత నిందితులు పరారయ్యారు.
ఈ ఘటనపై పెదపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. స్థానికులు ఎవరు హత్యలను అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం సంచలనం సృష్టించింది. మతృదేహాలను కాకినాడ జిజిహెచ్ కు తరలించారు. ఊళ్లో కరెంటు లేకపోవడంతో ఏమి జరిగిందో గుర్తించలేదని స్థానికులు తెలిపారు. పాతకక్షలతోనే హత్యలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు.