AP Whatsapp Certificates: వాట్సాప్‌లో పౌరసేవలు..త్వరలో తెనాలిలో ప్రారంభం, సమాచార గోప్యతపై సీపీఎం ఆందోళన..
AP Whatsapp Certificates: ఆంధ్రప్రదేశ్‌లో అతి త్వరలో వాట్సాప్‌లోనే పౌర సేవలు ప్రజలకు అందనున్నాయి. తెనాలిలో ప్రయోగాత్మకంగా వాట్సాప్ సేవల్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. మరోవైపు ప్రభుత్వ తీరుపై గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవ నిర్వాహకుల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతోంది.
AP Whatsapp Certificates: ఆంధ్రప్రదేశ్‌లో అతి త్వరలో వాట్సాప్‌లోనే జనన, మరణ ధృవీకరణ పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా కసరత్తు చేస్తోంది. మరోవైపు వాట్సాప్‌లో ఇచ్చే డిజిటల్ సర్టిఫికెట్ల చెల్లుబాటుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నకిలీలు పుట్టుకొచ్చే అవకాశాలతో పాటు న్యాయస్థానాల్లో డిజిటల్ సర్టిఫికెట్ల చెల్లుబాటుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏపీలో త్వరలోనే ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 18న వాట్సాప్‌లో పౌర సేవల్ని ప్రారంభించాలని భావించినా సాంకేతిక కారణాలతో అది వాయిదా పడింది. అయితే తెనాలిలో తొలి విడత పౌర సేవల్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వాట్సాప్ ద్వారా ప్రజలకు త్వరలోనే జనన, మరణ ధృవీకరణ పత్రాలు పొందే సదపాయం కూడా కల్పిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి విజయానంద్ ప్రకటించారు. ఈ నెలలోనే తెనాలీలో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను పరిశీలించనున్నట్లు వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు జనన, మరణ ధృవీకరణ పత్రాలు పొందే సేవలు కల్పించే ప్రక్రియపైన సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ సేవలు పౌరులకు మరింత సులభతరం చేయాలనే సదాశయంతో ముఖ్యమంత్రి వాట్సాప్ గవర్నెన్స్ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన ఆర్టీజీఎస్ అధికారులను సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా జనన మరణ ధృవీకరణ పత్రాల సేవలు కల్పించడమనేది కీలకమైందని, దీనికి సంబంధించిన పనులు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సేవలను పగడ్బందీగా ప్రజలకు అందిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెనాలీలో ముందుగా దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించాలని సూచించారు. అక్కడ క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులు, సాంకేతికంగా ఎదురయ్యే ఇబ్బందులను సునిశితంగా పరిశీలించి అధ్యయనం చేసి తదనుగుణంగా ఈ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. దీనికి కావాల్సిన అన్ని విధాల సహకారాన్ని పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, పురపాలక శాఖలు ఆర్టీజీఎస్ అధికారులకు అందించాలని సూచించారు.
వాట్సాప్ గవర్నెన్స్‌పై బోలెడు సందేహాలు..
వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా ప్రభుత్వం పౌరులకు అందించే ధృవీకరణ పత్రాలను డిజిటల్ కాపీలను అందిస్తారని, వీటికి నకిలీలు తయారైతే ఎవరు జవాబుదారీ వహిస్తారనేది గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి ధృవీకరణ పత్రాన్ని క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు నిర్దారించిన తర్వాతే ఇప్పటి వరకు జారీ చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు, సచివాలయాలను ఏర్పాటు చేసినా వాటిని ప్రధాన ప్రభుత్వ శాఖలతో అనుసంధానించక పోవడంతో అవి వ్యవస్థలో అనుబంధ విభాగాలుగా మాత్రమే మిగిలిపోయాయి. అన్ని ప్రభుత్వ శాఖలు తమకు అనుబంధంగా, తమ చెప్పు చేతల్లో పనిచేసే విభాగాలుగానే సచివాలయాలను మార్చేశాయి. దీంతో పౌర సేవలు గతంలో ఉన్న ప్రభుత్వ శాఖల ద్వారానే ఇప్పటికీ జరుగుతున్నాయి. సచివాలయాల్లో నేరుగా సేవలు అందే పరిస్థితి ఇప్పటికీ లేదు. తాజాగా వాట్సాప్ అందించే సేవలతో ఇంకెన్ని చిక్కులు వస్తాయనే సందేహాలు ఉన్నాయి.
న్యాయస్థానాల్లో చిక్కులు…
వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన డిజిటల్ సర్టిపికెట్లు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లను ఇప్పటికీ న్యాయస్థానాలు గుర్తించడం లేదు. అధికారుల సంతకాలు, అధికారిక చిహ్నాలు, ధృవీకరణలు లేని పత్రాలను కోర్టులు అనుమతించడం లేదు. ధృవీకరణలు జారీ చేసే అధికారుల వివరాలు ఉన్న పత్రాలను మాత్రమే కోర్టులు అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ సర్టిఫికెట్లు, పిడిఎఫ్ పత్రాల చెల్లుబాటుపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఆర్టీజీఎస్ మీడియా విభాగాన్ని హిందుస్తాన్ టైమ్స్ వివరణ కోరినా స్పందించలేదు.
సమాచార గోప్యతపై సీపీఎం ఆందోళన…
డేటా రక్షణ చట్టం లేకుండా 150 రకాల పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందించటం పౌరుల ప్రాథమిక హక్కులకు భంగకరమేనని సీపీఎం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వాట్సాప్ ద్వారా ఈ-గవరెన్స్ సేవలు అందించేందుకు మెటా కంపెనీతో ఒప్పందం చేసుకోవడాన్ని సీపీఎం తప్పు పట్టింది.
సర్టిఫికేట్ కావాల్సివస్తే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని వాట్సాప్‌లో అవి భద్రంగా ఉంటాయన్న చట్టబద్ధ గ్యారంటీ లేదని, వాటిని దుర్వినియోగం చేయరనే భరోసా లేదని, 2018 నుండి డేటా ప్రైవసీ చట్టం పెండింగులోనే వుందని అది చట్టం కాకుండా ఇలాంటి ఒప్పందాలు పౌరుల వ్యక్తిగత భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో ఆధార్ సహా అనేక రకాల డాక్యుమెంట్లు దుర్వినియోగం అయ్యాయని పౌర సేవలు వేగంగా అందుతాయో లేదో గ్యారంటీ లేకున్నా రాజకీయ, వ్యాపార ప్రయోజనాలకు డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం పుష్కలంగా ఉందన్నారు. ఇప్పటికే మీసేవ, సచివాలయ వ్యవస్థలు వున్నాయని వాట్సాప్‌తో ఒప్పందం చేసుకొని సచివాలయం సిబ్బందిని తగ్గించాలన్న యోచనలో ప్రభుత్వం వుందని ఆరోపించారు.
ప్రభుత్వ నిర్ణయంతో మీసేవ సిబ్బంది నిరుద్యోగులవుతారని గోప్యంగా ఉండాల్సిన పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కార్పొరేట్ కంపెనీల పరం చేయడం అభ్యంతరకరమన్నారు. డేటా ప్రైవసీ రక్షణ చట్టం వచ్చేంత వరకు ఈ ఒప్పందాన్ని అమలు చేయొద్దని, సచివాలయం సిబ్బందిని కుదించరాదని, మీసేవా కేంద్రాలకు భద్రత కల్పించాలని సీపీఎం డిమాండ్ చేసింది.
సంబంధిత కథనం