CID DSP Death: గుడి దగ్గర పడి ఉన్న శవం.. రాజమండ్రిలో అనుమానాస్పద స్థితిలో సీఐడీ డిఎస్పీ మృతి
CID DSP Death: రాజమండ్రిలో ఓ ఆలయం ముందు పడి ఉన్న గుర్తు తెలియని మృతదేహం చివరకు సీఐడీ డిఎస్పీదిగా తేలడంతో కలకలం రేగింది. రాజమండ్రి సీఐడీ డిఎస్పీగా పనిచేస్తున్న అధికారి కొద్ది రోజులుగా అదృశ్యమయ్యారు. అనూహ్యంగా శవమై కనిపించడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

CID DSP Death: ఆలయం ముందు గుర్తు తెలియని మృతదేహంగా స్వాధీనం చేసుకున్న శవం సీఐడీ డిఎస్పీదిగా తేలడంతో కలకలం రేగింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం గుడి ముందు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆరా తీయడంతో అది కనిపించకుండా పోయిన సీఐడీ డిఎస్పీదిగా తేలింది.
రాజమహేంద్రవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజమండ్రి గాంధీపురం పరిధిలోని ఎస్‌ఆర్‌ఎంటీ గోడౌన్ సమీపంలో ఉన్న సాయిబాబా గుడి దగ్గర మృతదేహం పడి ఉందని స్థానికుల నుంచి గురువారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందింది..
స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఫొటోను పోలీసు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారు. కాసేపట్లోనే పోలీసులు ఆయన్ని గుర్తించారు. రాజమండ్రిలో పనిచేస్తున్న సీఐడీ డీఎస్పీగా గుర్తించడంతో కలకలం రేగింది.
కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన బి.నాగరాజు 1995లో ఎస్‌ఐగా పోలీస్ సర్వీసులో చేరారు. రెండేళ్ల క్రితం డీఎస్పీగా పదోన్నతి లభించింది. గత ఏడాది క్రితం బదిలీపై రాజమహేంద్రవరంలోని ప్రాంతీయ సీఐడీ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. స్థానికంగా లాడ్జిల్లో ఉంటూ సీఐడీ కార్యాలయంలో విధులకు హాజరయ్యేవారు.
అనారోగ్య కారణాలతో నాగరాజు డిసెంబరు నుంచి మెడికల్ లీవులో ఉన్నారు. ఫిబ్రవరి నెల 2న రాజమహేంద్రవరం వెళుతున్నానని కర్నూలు నుంచి బయలుదేరి వచ్చారు. స్థానికంగా ఉండే లాడ్జిలో ఉంటూ 10వ తేదీ వరకూ కుటుంబ సభ్యులకు ఫోనులో అందుబాటులో ఉన్నారు. అదే రోజు రాత్రి 10 గంటలకు చివరిగా మాట్లాడారు. తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది.
హైదరాబాద్‌లో ఉంటున్న నాగరాజు కుమారుడు వంశీకృష్ణ గురువారం ఉదయం రాజమహేంద్రవరం వచ్చి తండ్రి కోసం ఆరా తీయడంతో ఆయన ఆఫీసుకు రావడం లేదని సిబ్బంది చెప్పారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన నాగరాజు ఫోటోను సీఐడీ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ బాజీలాల్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. సీఐడీ డిఎస్పీ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడంతో సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.