CBN House Issue: చంద్రబాబు కరకట్ట ఇల్లు అటాచ్‌మెంట్ కోసం కోర్టును ఆశ్రయించిన సిఐడి
CBN House Issue: అమరావతి భూసమీకరణ విషయంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నివాసాన్ని ఏపీ సిఐడి అటాచ్ చేసింది. ఆ ఇంటిని జప్తు చేయడానికి అనుమతించాలని కోరుతూ సిఐడి కోర్టను ఆశ్రయించింది.
CBN House Issue: చంద్రబాబు ఇంటి విషయంలో ఏపీసిఐడి దూకుడు పెంచింది. రాజధాని భూసేకరణ నుంచి మినహాయించినందుకు ప్రతిఫలంగానే ఉండవల్లి కరకట్టపై చంద్రబాబుకు లింగమనేని గెస్ట్ హౌస్ ఇచ్చారని ఆరోపణల నేపథ్యంలో ఆ ఇంటిని జప్తు చేయడానికి సిఐడి ప్రయత్నిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డు సమీపంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివసిస్తున్న ఇంటి జప్తునకు అనుమతి ఉత్తర్వులు పొందేందుకు విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ ఫైల్ దాఖలు చేసింది.
మంగళవారం జరిగిన విచారణలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైఎన్ వివేకానంద వాదనలు వినిపించారు. ఎటాచ్‌మెంట్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి ముందు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. చట్ట నిబంధనల పరిశీలన, తదుపరి వాదనలు వినేందుకు విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీచేశారు.
రాజధాని మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్ మార్చడంలో అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణతో గతేడాది మే నెలలో సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. చంద్రబాబు నివసిస్తున్న వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు చెందిన కరకట్ట రోడ్డులోని ఇంటిని, మాజీ మంత్రి నారాయణ సంబంధీకులకు చెందిన ఆస్తులను ఎటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోం శాఖ ఈ నెల 12న ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి అనుమతి పొందేందుకు సీఐడీ, విజయవాడ ఏసీబీ కోర్టులో దరఖాస్తు చేసింది.
రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ చేసిన సమయంలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఉండవల్లిలో కరకట్టపై ఉన్న చంద్రబాబు గెస్ట్‌హౌస్ ను ప్రభుత్వం అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం ఈ భవనాన్ని అటాచ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని విచారణ తేలిందని అధికారులు తెలిపారు.
ఇందులో భాగంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్లలో అవకతవకలకు పాల్పడి, అందుకు బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్ పొందారని సీఐడీ అభియోగించింది. చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారంటూ విచారణలో తేలిందని సీఐడీ అధికారులు తెలిపారు. తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు, సన్నిహితులకు ప్రయోజనాలు కల్పించేలా వ్యవహరించారని అభియోగించారు.
లింగమనేని సంస్థకుఅనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్ తీసుకున్నారని చంద్రబాబుపై అభియోగం ఉందన్నారు. ఈ నేపథ్యంలో క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేయాలని సీఐడీ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. చట్టం ప్రకారమే చంద్రబాబు గెస్ట్ హౌస్ ను అటాచ్ చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. స్థానిక జడ్జికి సమాచారం ఇచ్చి కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ అటాచ్ చేసినట్లు వెల్లడించారు.
చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని సీఐడీ అభియోగించింది. వీరిద్దరూ తమ పదవులను దుర్వినియోగం చేస్తూ.. రాజధాని, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ సరిహద్దుల విషయంలో కొందరికి అనుకూలంగా మార్పుచేర్పులు చేశారని తెలిపింది. రాజధాని ప్రాంతం, రింగ్ రోడ్డు సరిహద్దులు ముందుగా తెలుసుకున్న కొందరు... స్థానికుల నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారని సీఐడీ ఆరోపించింది.
రాజధాని ప్రకటన తర్వాత ఈ భూములను తిరిగి అధిక ధరకు విక్రయించారని అభియోగించింది. రాజధాని మాస్టర్ ప్లాన్, ఐఆర్ఆర్ లో లబ్దిపొందినందుకు విజయవాడకు చెందిన లింగమనేని రమేష్... గుంటూరు జిల్లా ఉండవల్లిలో కరకట్టపై ఉన్న ఇంటికి క్విడ్ ప్రోకో కింద చంద్రబాబుకు ఉచితంగా ఇచ్చారని పేర్కొంది. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ లో అవకతవకలు చంద్రబాబు, నారాయణకు తెలిసే జరిగాయని సీఐడీ ఆరోపించింది. ఈ అభియోగాల కారణంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి లబ్దిపొందిన కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ ను ప్రభుత్వం అటాచ్ చేసుకోవాలని సీఐడీ సూచించింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
సంబంధిత కథనం