Chittoor Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ బస్సు ఢీ- నలుగురి మృతి, 14 మందికి గాయాలు
Chittoor Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బస్సు ఢీకొన్న ఘటనలో 4గురు మృతి చెందారు, మరో 14 మంది గాయపడ్డారు. బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు.
Chittoor Accident : చిత్తూరు జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి- చెన్నై మార్గంలో లారీ, ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నలుగురు మృతి
ఈ ప్రమాదంలో వడమాలపేట సీతారామాపురం గ్రామానికి చెందిన పార్థసారధి నాయుడు (62), రాజేంద్రనాయుడు (60), తిరుపతికి చెందిన మణిగండ (8)తో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుల్లో తమిళనాడుకు చెందిన చిన్నమలై (55) పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
తిరుపతికి చెందిన సుబ్బరత్నమ్మ (42), భరత్ (40), తిరువళ్లూరుకు చెందిన సుధాకర్ (50)కు తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 మందికి గాయాలు అయ్యాయి, వీరి నగరి ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్య చికిత్స అందించారు. తీవ్రగాయాలైన వారిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు. బస్సు అతి వేగంగా వెళ్లడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు.
సాఫ్ట్ వేర్ యువతి మృతి
బైక్ ను కారు ఢీకొన్న ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న యువతి మృతి చెందింది. మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి పోలిపల్లి సమీపంలో జరిగింది. అనకాపల్లి జిల్లా దేవరపల్లికి చెందిన రొంగళి లీలా (23), పూసపాటిరేగ మండలం కోనాడ గ్రామానికి చెందిన అడపాక శివ గణేష్ మిరాకిల్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.
ఆదివారం సెలవు కావడంతో వీరిద్దరూ బైక్ పై తగరపువలస వెళ్లారు. తిరిగి వస్తుండగా పోలిపల్లి వద్ద వెనుక నుంచి వచ్చిన కారు వీరి బైక్ ను ఢీకొట్టింది. దీంతో లీల అక్కడికక్కడే మృతిచెందగా, శివ గణేష్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన యువకుడ్ని తగరపువలసలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు .