Chilkur Priest Rangarajan : 'ఇది ధర్మపరిరక్షణపై జరిగిన దాడి'- చిలుకూరు అర్చకుడిపై దాడిని ఖండించిన పవన్ కల్యాణ్
Chilkur Priest Rangarajan : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. రంగరాజన్ పై దాడి వ్యక్తిపై కాదు, ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలని అభిప్రాయపడ్డారు.

Chilkur Priest Rangarajan : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. రంగరాజన్ పై దాడి దురదృష్టకరమన్నారు. ఇది ఒక వ్యక్తిపై కాదు, ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలని అభిప్రాయపడ్డారు.
"చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. దురదృష్టకరమైన ఘటన ఇది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలి. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారు. పోరాటం చేస్తున్నారు"- పవన్ కల్యాణ్
దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
రామరాజ్యం సంస్థ సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక అర్చకులు రంగరాజన్ పై దాడి చేయడం వెనక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలని పవన్ కల్యాణ్ కోరారు. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పలు విలువైన సూచనలను రంగరాజన్ తనకు అందించారన్నారు.
టెంపుల్ మూమెంట్ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో తెలియచేశారన్నారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై ఆయన ఎంతో తపన పడుతున్నారని, ఆయనపై చోటు చేసుకున్న దాడిని ప్రతి ఒక్కరం ఖండించాలన్నారు.
అసలేం జరిగింది?
చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి జరిగింది. రామరాజ్యం స్థాపనకు ప్రైవేట్ ఆర్మీ అని చెప్పుకుంటున్న ఓ గ్యాంగ్ రంగరాజన్ ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. తామను తాము ఇక్ష్వాకు వంశస్తులుగా చెప్పుకుంటున్న కొంతమంది ఒక గ్యాంగ్ గా ఏర్పడి...రామరాజ్య స్థాపనకు తమతో కలిసి రావాలని పలువురిని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ నెల 7వ తేదీన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పీఎస్ పరిథిలోని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఇంటికి వెళ్లారు. తమతో చేతులు కలపాలని రంగరాజన్‌పై ఒత్తిడి చేశారు. అయితే రంగరాజన్ ఒప్పుకోకపోవడంతో ఆయనపై దాడికి పాల్పడ్డారు. తన కుమారుడిని విచక్షణారహితంగా కొట్టారని రంగరాజన్ తండ్రి సౌందర రాజన్ మెయినాబాద్ పోలీసులకు ఫిర్యాదులో చేశారు.
ఒకరు అరెస్ట్
అయితే ఈ విషయంపై అర్చకుడు రంగరాజన్, పోలీసులు స్పందించలేదు. దాడికి పాల్పడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. రంగరాజన్ తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ గ్యాంగ్ నాయకుడిగా భావిస్తున్న వీరరాఘవరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. గ్యాంగ్ లోని మిగిలిన సభ్యుల కోసం మొయినాబాద్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
సంబంధిత కథనం