Amaravati House Sites: నేడు అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ
Amaravati House Sites: రైతుల అభ్యంతరాలు, కోర్టు కేసుల నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో మూడేళ్లుగా నిలిచిపోయిన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని నేడు ముఖ్యమంత్రి చేపట్టనున్నారు. వెంకటపాలెంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అంద చేయనున్నారు.
Amaravati House Sites: రాజధానిప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి రంగం సిద్దమైంది. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది మహిళలకు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. దీంతో పాటు సీఆర్డీఏ ప్రాంతంలో రూ. 443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందచేస్తారు. సీఆర్డీఏ పరిధిలో 1,402 ఎకరాల్లో 50,793 మంది మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయడంతో పాటు 5,024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో నిర్వహిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,43,600 మంది లబ్ధిదారులకు 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను కేవలం 1 రూపాయికే అన్ని హక్కులతో అందచేయనున్నారు. వీటి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పేద మహిళలకు రూ.9,406 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. గత ప్రభుత్వంలో ఇవే ఇళ్లకు అసలు, వడ్డీలను కలిపి ఒక్కొక్కరు రూ. 7.20 లక్షలు చెల్లించాల్సి వచ్చేది
లబ్ధిదారులు చెల్లించాల్సిన ముందస్తు వాటా సొమ్ములో 50 శాతాన్ని రాయితీగా అందిస్తూ, 365 చదరపు అడుగుల టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు 44,304 మందికి ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున, 430 చదరపు అడుగుల 74,312 టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు రూ. 50 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా వారు చెల్లించాల్సిన రూ. 482 కోట్ల భారాన్ని కూడా ప్రభుత్వం భరిస్తుంది.
ప్రభుత్వం కేటాయించే టిడ్కో ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ. 60 వేల లబ్ధి కలగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 2.62 లక్షల మంది టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు సబ్సిడీ రూపంలో రూ. 14,514 కోట్లు, ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో రూ. 1200 కోట్లు, మౌలిక సదుపాయాలకు మరో రూ. 3,000 కోట్లు కలిపి మొత్తంగా రూ. 18,714 కోట్ల లబ్ధిని ప్రభుత్వం అందచేయనుంది.
గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లలో మంచినీటి సదుపాయాలు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులను నిర్లక్ష్యం చేసిందని, పూర్తి మౌలిక సదుపాయాలతో ఇళ్లను వైఎస్ జగన్ ప్రభుత్వం లబ్దిదారులకు అందచేస్తున్నట్లు తెలిపారు.
పేదలకు ఇళ్లు….
"నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల" పథకంలో భాగంగా సీఆర్డీఏ పరిధిలో అన్ని మౌలిక సదుపాయాలతో మొత్తం 25 లేఔట్లను ఏర్పాటు చేశారు. 23,762 మంది గుంటూరు జిల్లా మహిళలకు 11 లేఔట్లు కేటాయించారు. 27,031 మంది ఎన్టీఆర్ జిల్లా లబ్దిదారులకు 14 లేఔట్లు ఏర్పాటు చేశారు.
ఇళ్ల కేటాయింపు కోసం మొత్తం 80,000 హద్దు రాళ్లతో ఇంటి స్థలాలకు సరిహద్దులు నిర్ణయించారు. 95.16 కి.మీల మేరకు గ్రావెల్ తో అంతర్గత రవాణా వ్యవస్థ నిర్మాణం పూర్తి చేశారు. సీఆర్డీఏ పరిధిలోని పేదల హౌసింగ్ కాలనీల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి మరో రూ. 1,280 కోట్లు, మౌలిక సదుపాయాలకు మరో రూ. 700 కోట్లు.. మొత్తం దాదాపు రూ.2,000 కోట్ల వ్యయంతో "వైఎస్సార్ జగనన్న కాలనీ"ల నిర్మాణం చేపడుతున్నారు.
మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా వారి పేరు మీద పేరు మీద ఇళ్ల పట్టాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30.60 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ చేశారు. వాటిలో 21 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ప్రతి పేద మహిళకు కనీసం రూ.5 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు లబ్ధి కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇళ్ల స్థలాల రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా పేద మహిళల చేతుల్లో రూ. 2 లక్షల కోట్ల నుండి 3 లక్షల కోట్ల సంపద చేరుతుందని అంచనా వేశారు. ఇళ్ల పట్టాలు పొందడంలో ఏ రకమైన ఇబ్బందులున్నా టోల్ ఫ్రీ నంబర్ 1902ను సంప్రదించాలని సూచించారు.
మరోవైపు 2019 ఎన్నికలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తైన టిడ్కో ఇళ్లను నాలుగేళ్లుగా లబ్దిదారులకు అందచేయకుండా ఇప్పుడువాటికి రంగులు మార్చి, తాము నిర్మించినట్లు మభ్యపెడుతూ లబ్దిదారులకు కేటాయిస్తున్నారని టీడీపీ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.