Jagan Delhi Tour: హోంమంత్రి అమిత్‌షాతో సిఎం జగన్ భేటీ..పాత విషయాలపైనే చర్చ-chief minister jaganmohan reddy met union home minister amit shah ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Chief Minister Jaganmohan Reddy Met Union Home Minister Amit Shah

Jagan Delhi Tour: హోంమంత్రి అమిత్‌షాతో సిఎం జగన్ భేటీ..పాత విషయాలపైనే చర్చ

HT Telugu Desk HT Telugu
Mar 30, 2023 06:28 AM IST

Jagan Delhi Tour: ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. పక్షం రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీ వెళ్లిన సిఎం జగన్ పలు అంశాలపై కేంద్ర హోంమంత్రితో చర్చలు జరిపారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ముఖ్యమంత్రి కేంద్ర హోం మంత్రితో భేటీ అయ్యారు.

కేంద్ర హోంమంత్రితో సిఎ: జగన్ భేటీ
కేంద్ర హోంమంత్రితో సిఎ: జగన్ భేటీ

Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రితో బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత భేటీ అయ్యారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రాత్రి 9.30కు భేటీ జరగాల్సి ఉన్నా, అమిత్ షా ఇంటికి రావడానికి ఆలస్యం కావడంతో 10.45కు మొదలైంది. 11.25వరకు ఈ భేటీ జరిగింది. ముందస్తు ఎన్నికలు, వివేకాహత్య కేసులో దర్యాప్తు బృందాన్ని సుప్రీం కోర్టు ఆదేశాలతో మార్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రిపర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మార్చి 16న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ అయిన తర్వాత పలు అంశాలను ప్రధాని, అమిత్‌షా దృష్టికి తీసుకు వెళ్లినట్లు ముఖ‌్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. తాజాగా అవే అంశాలపై ముఖ్యమంత్రి అమిత్‌షాతో చర్చించినట్లు ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగానష్టపోయిందని. అశాస్త్రీయ విభజన కారణంగా ఆర్థికంగా, ఆదాయాలపరంగా, అభివృద్ధి పరంగా, వివిధ సంస్థల రూపేణా తీవ్ర నష్టం వాటిల్లిందని ఈ నష్టాలనుంచి కాపాడేందుకు, రక్షణగా విభజన చట్టంలో కేంద్రం ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిందని సిఎం గుర్తు చేశారు. పార్లమెంటు సాక్షిగా కూడా ఈ హామీలు ఇచ్చారని, విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తున్నా రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయని వీటిపై వెంటనే దృష్టిసారించమని సిఎం కోరారు.

పోలవరం ప్రాజెక్టును మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలని విజ్ఞప్తి చేశారు. వరదల కారణంగా డయాఫ్రంవాల్‌ దెబ్బతిందని, డయాఫ్రంవాల్‌ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.202౦ కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని డీడీఆర్‌ఎంపీ అంచనా వేసిందని ఈ డబ్బును వెంటనే విడుదలచేయాలని విజ్ఞప్తి చేశారు.

పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానానుంచి రూ.2600.74 కోట్ల రూపాయలు ఖర్చుచేసిందని గడచిన రెండు సంవత్సరాలుగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించిందని, ఈ మొత్తానికి వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. తాగు నీటి సరఫరా అంశాన్నికూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌వారీ నిబంధనలను సడలించాలన్నారు.

పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని , డీబీటీ పద్ధతిలో ముంపు బాధితులకు ఈ సహాయం అందిస్తే జాప్యాన్ని నివారించవచ్చని సిఎం లేఖలో పేర్కొన్నారు.

నిధుల లోటు పూడ్చాలి…

2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయని, ఈ నిధులను వెంటనే విడుదలయ్యేలా చూడాలని కోరారు. గత ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడుకుందన్న కారణంతో ఇప్పుడు ఆంక్షలు విధించారని, నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారని, 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించారని ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు, 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉందని, వీటిని వెంటనే ఇప్పించాల్సిందిగా కోరారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని, రూ.56లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్‌ ఇవ్వడంవల్ల దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోందని ఈ విషయంలోఆంధ్రప్రదేశ్‌ చేసిన విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్‌ కూడా నిర్ణయించిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.కేంద్రం ప్రభుత్వం నెలకు వినియోగించని రేషన్ దాదాపు 3లక్షల టన్నులు ఉంటుందని, ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే సరిపోతుందన్నారు. దీనిపై దృష్టిపెట్టాలని కోరారు.

ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే….

రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చిందని, దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయని ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుందని సిఎం గుర్తు చేశారు. పెద్ద ఎత్తన పరిశ్రమలు రావడమేకాకుండా, సేవారంగం విస్తరిస్తుందని . స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

కొత్తగా కేంద్రం మంజూరుచేసిన మూడు మెడికల్‌ కాలేజీలతో కలిపి మొత్తం రాష్ట్రంలో 14 మాత్రమే ఉన్నాయని మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరుచేయాలని కోరారు. ఈ కాలేజీలకు సంబంధించిన పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని, కాలేజీల నిర్మాణానికి కేంద్రం తగిన విధంగా సహాయపడాలని విజ్ఞప్తి చేశారు.

WhatsApp channel