Srikakulam News : శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో చూచిరాతలకు ఉపాధ్యాయులు సహకరించారు. దీంతో 11 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. ముగ్గురు ప్రధానోపాధ్యాయులపై చర్యలకు సిఫార్సులు చేశారు. అలాగే ఒక బోధనేతర సిబ్బందిని సస్పెండ్ చేయడంతో పాటు ఐదుగురు విద్యార్థులను డిబార్ చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లా ఉలిక్కిపడింది.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి ఆదర్శ పాఠశాలలో పదో తరగతి పరీక్షల్లో అక్రమాలు బయటపడ్డాయి. ఈ పాఠశాలలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రం 'ఏ'లో 207 మంది, పరీక్షా కేంద్రం 'బి'లో 218 మంది విద్యార్థులకు కేటాయించారు. కుప్పిలిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులే స్లిప్పులు తయారు చేసి ఆదర్శ పాఠశాల కేంద్రంలో పరీక్ష రాస్తున్న విద్యార్థులకు అందజేస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ స్వ్కాడ్ ఉన్నప్పటికీ పక్కా ప్రణాళికతో విచ్చలవిడిగా చూచిరాత జరిగిందని ఆరోపణలు వచ్చాయి.
ట్రిపుల్ ఐటీల్లో సీట్లే లక్ష్యంగా జిల్లాలోని పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో జిల్లా విద్యా శాఖను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈవో) తిరుమల చైతన్య ఆదేశాల మేరకు నాలుగు స్క్వాడ్ బృందాలను శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఆ నాలుగు బృందాలు కుప్పిలి ఆదర్శ పాఠశాలలోని రెండు పరీక్షా కేంద్రాలను సందర్శించాయి. విద్యార్థులు ఇంగ్లిష్ పరీక్షను చూసి రాసినట్లు గుర్తించాయి. చూచిరాతకు ఉపాధ్యాయులు, సిట్టింగ్ స్వ్కాడ్ సహకరించడంతో ఆ బృందాలు నిర్ఘాంతపోయాయి. దీంతో డీఈవో తిరుమల చైతన్యకు వివరాలు అందించాయి.
పరీక్ష చూసి రాతకు సహకరించిన సిట్టింగ్ స్వ్కాడ్ ఎంవీ కామేశ్వరరావు, విద్యా శాఖ అధికారులు పి. హరికృష్ణ, బీవీ సాయిరాం, ఇన్విజిలేటర్లు ఎం. కనకరాజు, పి.నాగేశ్వరరావు, ఎస్.కృష్ణ, కె.కామేశ్వరావు, ఎస్.శ్రీనివాసరావు, ఎ.శ్రీరారాములునాయుడు, పి.ఫల్గుణరావు, బి.రామ్మోహన్‌రావు, బోధనేతర సిబ్బంది ఒకరిని డీఈవో తిరుమల చైతన్య సస్పెండ్ చేశారు. అలాగే పరీక్షా కేంద్రం ఏలో ముగ్గురు, పరీక్షా కేంద్రం బీలో ఇద్దరు విద్యార్థులు మొత్తం ఐదుగురు విద్యార్థులను డిబార్ చేశారు.
కుప్పిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జె.పద్మకుమారి, చీఫ్ సూపరింటెండెంట్, కేశవరాయునిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పీవీ దుర్గారావు, చీఫ్ సూపరింటెండెంట్, కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.లక్ష్మణరావుపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్‌జేడీ)కి డీఈవో తిరుమల చైతన్య నివేదిక పంపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం