Cheating Love: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం...ప్రేమ పేరుతో మోసం, బీఫార్మసీ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం
Cheating Love: తూర్పుగోదావరి జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. బీ ఫార్మసీ విద్యార్థినికి ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆసుపత్రి ఉద్యోగి మోసానికి పాల్పడ్డాడు. ఆమె నిలదీయడంతో అసభ్యకర ఫోటోలు బయట పెడతాననంటూ బెదిరింపులకు దిగాడు.
Cheating Love: తూర్పు గోదావరి జిల్లాలో బీఫార్మసీ విద్యార్ధినిని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. రాజ మహేంద్ర వరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలానికి చెందిన కౌలు రైతు దంపతులకు పెళ్లైన 11 ఏళ్ల తరువాత ఆడబిడ్డ పుట్టింది. ఆమె ప్రస్తుతం రాజమహేంద్రవరం సమీపంలోని ఓ ఫార్మసీ కాలేజీలో బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతోంది.
చదువుకుంటునే రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో క్లినికల్ ఫార్మసిస్టుగా పార్ట్‌టైం ఉద్యోగం చేస్తోంది. ఆసుపత్రిలో దీపక్ అనే ఉద్యోగి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో వెంటపడి పెళ్లి చేసుకుంటానని నమ్మించి దగ్గరయ్యాడు. పెళ్లి గురించి అడిగితే తాను పెళ్లి చేసుకోనని, గట్టిగా మాట్లాడితే అసభ్యకర ఫోటోలు సోషల్ మీడియాలో బయటపెడతానని బెదిరింపులకు దిగాడు.
దీంతో ఈనెల 23న ఆమె ఆసుపత్రి విధుల్లో ఉన్న సమయంలో ఓ మత్తుమందును అధిక మోతాదులో శరీరంలోకి ఎక్కించకుని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో తోటి ఉద్యోగులు ఆమెను గమనించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలికి అక్కకు ఫోన్ చేసి మీ సోదరి అస్వస్థతకు గురైందని ఫోన్ చేసి దీపక్ చెప్పాడు.
కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకోవడంతో సోమవారం నుంచి దీపక్ పరారీలో ఉన్నాడు. అలా ఒకరి నుంచి ఒకరికి తెలియడంతో పాటు, ఆమె సూసైడ్ నోట్ బయట పడటంతో దీంతో ఈ ఘటన అందరికి తెలిసింది.
సూసైడ్ నోట్‌లో వివరాలు..
జీవితమంతా నాశనం చేసుకుని ఏడవడానికి కూడా తనకు ఓపిక లేదని, ఓ వ్యక్తి చేతిలో మోసం పోయి ఇంటికి వెళ్లే ధైర్యం లేదని నోట్‌లో పేర్కొంది. జీవితంపై చాలా కలలు కన్నానని, కానీ వాటిని ఒక కసాయి చిదిమేశాడని ఆవేదనను వ్యక్తం చేసింది. ఒక ఫంక్షన్‌కు చీర కట్టుకుని వెళ్లడమే తాను చేసిన పాపమని, ఒక మోసగాడి కన్ను నాపై పడిందని రాసుకొచ్చింది. అమ్మ, నాన్న క్షమించండి, తనకు వేరే దారి లేకే చనిపోతున్నా, తీరని శోకాన్ని మిగిల్చి వెళ్తున్నానని అని ప్రాధేయపడింది.
తాను చదువుకున్న చదువు కూడా తాను చనిపోవడానికే అన్న సంగతి గ్రహించలేకపోయాను అని పేర్కొంది. ఆడపిల్లలకు రక్షణ లేదని, తనను ఎంత కొట్టినా, తిట్టినా ఓపికగా భరించానని తనకు ఎదురైన ఘటనలను వివరించింది. ఇక తట్టుకునే శక్తి, ఓపిక తనకు లేదని, అతడు చాలా లైంగికంగా వేధించాడని తెలిపింది.
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గొంతు కోశాడని, చనిపోతూ అబద్ధాలు చెప్పాల్సిన పని లేదని లేఖలో రాసుకొచ్చింది. ఎంతో ఆవేదనతో కుమిలిపోయి ఈ నిర్ణయం తీసుకున్నానని, ఒక ఆడపిల్ల ఉసురు ఊరికే పోదని అందులో పేర్కొంది. తన అవయవాలు దానం చేయమని ప్రాధేపడుతున్నానని తెలిపింది.
బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదు
ఎఎస్‌పీ సుబ్బరాజు, డీఎస్పీలు రమేష్‌బాబు, భవ్య కిషోర్ మాట్లాడుతూ నిందితుడిని అరెస్టు చేసి, బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ బాజీలాల్ తెలిపారు. తన సోదరి ఫోన్ నిందితుడు దీపక్ వద్దే ఉందని, అందులో సమాచారాన్ని అతడు డిలీట్ చేశాడని బాధితురాలి సోదరి ఆరోపించారు. బాధితురాలు ప్రస్తుతం కోమా స్థితిలో ఉందని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మరో 48 గంటలు గడిస్తేగానీ ఏ విషయం చెప్పలేమని అన్నారు.
విద్యార్థులు ఆందోళన
సూసైడ్ నోట్ బయటకు వచ్చిన తరువాత రాజమహేంద్రవరంలోని ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆమెకు న్యాయం చేయాలని నినాదించారు. రోడ్లను దిగ్బందించారు. విద్యార్థులకు ఆందోళనకు విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ మద్దతుగా నిలిచింది.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం