AP Group 2 Syllabus: గ్రూప్ 2లో మార్పులు.. కొత్త సిలబస్ ప్రకటించిన APPSC! ఈ పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి
APPSC Group 2 Syllabus Updates: గ్రూప్ 2 సిలబస్ కు సంబంధించి పలు మార్పులు చేసింది ఏపీపీఎస్సీ. ఈ మేరకు కొత్త సిలిబస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
APPSC Group 2 Syllabus: త్వరలోనే ఏపీ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో గ్రూప్-2 సిలిబస్ కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పలు మార్పులు చేస్తూ కొత్త సిలబస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాత పరీక్షల ద్వారా భర్తీ ప్రక్రియను చేపట్టనుంది. మొదటగా స్క్రీనింగ్ పరీక్ష తర్వాత... రెండో దశలో మెయిన్స్ నిర్వహించనున్నారు.
మొత్తం 3 పేపర్లు… 450 మార్కులు
కొత్తగా ప్రకటించిన సిలబస్ ప్రకారం… 150 మార్కులకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.ఇందులో కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని చేర్చారు ఒక్కో సెక్షన్ కు 30 మార్కులు కేటాయించారు. ఇందులో అర్హత సాధిస్తేనే మెయిన్స్ కు అర్హులు అవుతారు..మెయిన్స్‌లో మొత్తం 2 పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో చూస్తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉన్నాయి. ఇక పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయించారు.
గ్రూప్ 2 కొత్త సిలబస్ ను కింద ఇచ్చిన PDFలో చూడొచ్చు…
మరోవైపు త్వరలోనే గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న లెక్కలను తీసే పనిలో అధికారులు ఉన్నాయి. దాదాపు 1082 పోస్టులు ఖాళీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ రావొచ్చు.
కొద్దిరోజుల కిందటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Andhra Pradesh Public Service Commission) - ఏపీపీఎస్సీ పలు ఉద్యోగ నియామకాల్లో కీలక మార్పులు చేసింది. గ్రూప్ - 2 (Group-2)... గ్రూప్ - 3 (Group -2) రిక్రూట్మెంట్లకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ ఉద్యోగాలకు పోటీ పడే వారికి కంప్యూటర్ అర్హత తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ -2, గ్రూప్ - 3 ఉద్యోగ నియామకాల్లో కంప్యూటర్ ప్రొఫిషీయన్సీ సర్టిఫికెట్ ను తప్పనిసరి పొందాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ ప్రకారం... గ్రూప్ - 2, గ్రూప్ -3 నోటిఫికేషన్ల ద్వారా నియమితులయ్యే వారంతా ఏపీపీఎస్సీ లేదా ఏపీ సాంకేతిక విద్యా బోర్డు నిర్వహించే కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్టు (సీపీటీ) (Computer Proficiency test) పాస్ కావాల్సిందే. 100 మార్కులకి నిర్వహించే ఈ పరీక్షలో అర్హత సాధించేందుకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 30 మార్కులు... బీసీలు 35.. ఓసీలు 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది.