Oath Words Change: ఎమ్మెల్యేల ప్రమాణంలో మాయమైన అంత:కరణ శుద్ధితో పదం, శ్రద్ధాసక్తులుగా సవరణ
Oath Words Change: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాసనసభ్యుల ప్రమాణంలో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. శాసనసభ్యుల ప్రమాణంలో చాలామందిని కంగారు పెట్టే పదాన్ని తొలగించారు.

Oath Words Change: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాసనసభ్యుల ప్రమాణంలో చాలామందికి నోరు తిరగని పదం మాయమైంది. గతంలో శాసనసభ్యులుగా, మండలి సభ్యులుగా ప్రమాణం చేసేటపుడు నోరు తిరగక తిప్పలు పడ్డ పదాన్ని తొలగించారు.
గతంలో పలువురు సభ్యులు తడబడి, పలకడానికి తత్తరపడుతూ ట్రోలింగ్‌కు గురయ్యారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే క్రమంలో “అంత: కరణ శుద్ధితో” పదాన్ని తొలగించారు. ఎమ్మెల్యేగా స్వీకరించే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తామని ఎమ్మెల్యేలు సభలో చేసే ప్రమాణ పత్రాన్ని సవరించారు. అంతకరణ శుద్ధితో పదాన్ని పలకలేక చాలామంది సభ్యులు తడబడి తిప్పలు పడ్డారు.
ఏపీ అసెంబ్లీలో సభ్యుల ప్రమాణం సందర్భంగా అదితిగజపతిరాజు పూసపాటి, పల్లె సింధూర రెడ్డి ఆంగ్లంలో ప్రమాణం చేశారు. కొందరు సభ్యులు శ్రద్ధాసక్తులతో పదాన్ని పలకడానికి కూడా ఇబ్బంది పడ్డారు.
పేరు మర్చిపోయిన జగన్…
ఏపీ అసెంబ్లీలో ప్రమాణం చేసిన మాజీ సిఎం జగన్ తన పేరు మర్చిపోయారు. మొదట వైఎస్. జగన్మోహన్ అని పలికిన ఆయన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను పూర్తి పేరును రెండోసారి పలికారు. మంత్రి నారా లోకేష్ కూడా ప్రమాణం సందర్భంగా తత్తరపడ్డారు. మాజీ మంత్రి పరిటాల సునీత ప్రమాణంలో రెండు సార్లు వేరువేరు పేర్లను పలికారు.
మొదట సిఎం చంద్రబాబు ప్రమాణం…
ఏపీ అసెంబ్లీలో సిఎం నారా చంద్రబాబు నాయుడు శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. 16వ శాసన సభ సమావేశాలను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే సభా నియమాలను ప్రకటించారు. అనంతరం కొత్త సభ్యుల ప్రమాణ కార్యక్రమాన్ని చేపట్టారు.
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదట సభలో ప్రమాణం చేశారు. చంద్రబాబు నాయుడు అనే నును శాసనసభ్యునిగా ఎన్నికైనందున, శాసనం ద్వారా నిర్మితమైన భారతరాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడతానని, తాను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుడైన తాను అనంతరం సభ నియమాకాలకు కట్టుబడి, వాటిని అనుసరిస్తూ, సభా మర్యాదలు కాపాడతానని, సంప్రదాయాలు గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేశారు. చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్, ఆపై క్యాబినెట్ మంత్రులు, వారి తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రమాణం చేశారు.