Kakinada Tragedy : నా భార్య చాలా మంచిది.. పిల్లలను చంపడానికి కారణం అదే.. సూసైడ్ నోట్‌లో చంద్రకిశోర్!
Kakinada Tragedy : హోలీ పండుగ రోజు కాకినాడలోని సుబ్బారావునగర్‌లో దారుణం జరిగింది. కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడిగా మారి, అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమేశాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.
అభం శుభం తెలియని చిన్న పిల్లలు వారు. ఒక బాలుడు యూకేజీ చదువుతుంటే.. మరో బాలుడు ఒకటో తరగతి చదువుతున్నాడు. అంత చిన్న పిల్లలు సరిగా చదవడం లేదని.. భవిష్యత్తులో బాగా బతకలేరని ఆ తండ్రికి ఎందుకు అనిపించిందో తెలీదు. కానీ.. వారిని అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా అందరినీ కలచివేస్తోంది.
పిల్లలను చంపేసి..
ఓఎన్జీసీ ఉద్యోగి వానపల్లి చంద్రకిశోర్ కాకినాడ రూరల్ తోట సుబ్బారావునగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన ఈ నెల 14న తన ఇద్దరు పిల్లలను చంపేసి, తానూ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే.. చంద్రకిశోర్ ధైర్యవంతుడని, పిల్లలంటే ఎంతో ప్రేమని అతని బంధువులు చెబుతున్నారు. కానీ ఎందుకిలా చేశారనేది మాత్రం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు.
ధైర్యం చెప్పేవారు..
చంద్రకిశోర్ అందరికీ ధైర్యం చెబుతుండేవారని ఆయన బావమరిది ఉమాశంకర్ అంటున్నారు. తన పిల్లల్ని రూ.లక్షన్నర ఫీజు చెల్లించి చదివించలేమనే ఉద్దేశంతో.. ఆ స్కూలు నుంచి ఇటీవలే రూ.50 వేలు ఫీజున్న పాఠాశాలకు మార్చాల్సి రావడాన్ని ఆయన తట్టుకోలేకపోయారని బంధువులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి సర్పవరం స్టేషన్‌లో ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, సీఐ పెద్దిరాజు వివరాలు వెల్లడించారు.
సూసైడ్ నోట్ లభ్యం..
ఘటన జరిగిన స్థలంలో తమకు సూసైడ్ నోట్ లభ్యమైందని.. అది చంద్రకిశోరే రాసినట్లు నిర్ధారించుకున్నామని ఏఎస్పీ మనీష్ దేవరాజ్ స్పష్టం చేశారు. ఆ నోట్‌లో తమ పిల్లలు సరిగా చదవట్లేదని, ఈ పోటీ ప్రపంచంలో సరిగ్గా చదవకపోతే జీవితంలో స్థిరపడలేరని, వారికి కష్టాలొస్తాయని, వాటిని తాను చూడలేననే భావనతో మానసికంగా కుంగిపోయినట్లు తెలుస్తోందన్నారు.
నా భార్య మంచిది..
తన భార్య చాలా మంచిదని సూసైడ్ నోట్‌లో చంద్రకిశోర్ రాసినట్లు పోలీసులు వివరించారు. దర్యాప్తులో వేరే కోణాలు కనిపించలేదని స్పష్టం చేశారు. మిగతా తల్లిదండ్రులంతా ఈ కేసును ఉదాహరణగా తీసుకుని.. తమ పిల్లల చదువు విషయంలో ఒత్తిడి తేవద్దని సూచించారు. చిన్నతనంలోనే పిల్లల భవిష్యత్తుపై నిర్ధారణకు రాకూడదని చెప్పారు. అనాలోచిత నిర్ణయం కారణంగా.. కుటుంబాలు ఇలా నష్టపోతాయని వివరించారు.