Chandrababu Oath: గవర్నర్‌ లేకుండానే ముహుర్తానికి ప్రధాని సమక్షంలో చంద్రబాబు బాధ్యతల స్వీకారం-chandrababus assumption of responsibility in the presence of the prime minister for without the governor ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Oath: గవర్నర్‌ లేకుండానే ముహుర్తానికి ప్రధాని సమక్షంలో చంద్రబాబు బాధ్యతల స్వీకారం

Chandrababu Oath: గవర్నర్‌ లేకుండానే ముహుర్తానికి ప్రధాని సమక్షంలో చంద్రబాబు బాధ్యతల స్వీకారం

Sarath chandra.B HT Telugu
Jun 13, 2024 11:38 AM IST

Chandrababu Oath: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ముహుర్త సమయం కంటే ఆలశ్యంగా జరిగింది. ముహుర్త సమయానికి గవర్నర్ కాన్వాయ్‌ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ప్రధాని సమక్షంలో చంద్రబాబు అధికారిక పత్రాలపై సంతకాలు చేశారు.

మంగళవారం ఉదయం 11.30కు కేసరపల్లి సమీపంలో జాతీయ రహదారిపై నిలిచిపోయిన గవర్నర్ కాన్వాయ్
మంగళవారం ఉదయం 11.30కు కేసరపల్లి సమీపంలో జాతీయ రహదారిపై నిలిచిపోయిన గవర్నర్ కాన్వాయ్

Chandrababu Oath: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముందుగా నిర్ణయించిన ముహుర్తానికి నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. ప్రమాణ స్వీకారానికి నిర్ణయించిన 11 గంటల 27 నిముషాల ముహూర్తానికి బహిరంగ వేదికపై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయలేక పోయారు.

గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ ప్రమాణ స్వీకార వేదికకు మూడు కిలోమీటర్ల దూరంలోని నిలిచిపోయారు. దాదాపు గంటకు పైగా గవర్నర్ కాన్వాయ్‌ జాతీయ రహదారిపై నిలిచిపోయింది. వివిఐపిల ప్రయాణం కోసం ప్రత్యేకంగా స్టెరైల్ లైన్ ఏర్పాటు చేసినా దానిని నిర్వహించడంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారు.

విజయవాడ రామవరప్పాడు రింగ్ వద్ద ఐపీఎస్ అధికారి విజయరావు నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను నియంత్రించడం, ముఖ్యమైన వాహనాలను అనుమతించడంలో ఆయన నిర్లక్ష్యం ప్రదర్శించారు. కేవలం రేడియో మెసేజీలపై ఆధారపడి ట్రాఫిక్‌ నియంత్రించారు. ఈ క్రమంలో అవసరం లేని వాహనాలను కూడా స్టెరైల్‌ లైన్‌లోకి వదిలేశారు. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఉదయం 9.15కు రామవరప్పాడు రింగ్‌ క్రాస్ చేసింది. ఆ తర్వాత అమిత్‌ షా , ఇతర కేంద్ర మంత్రులు, పవన్ కళ్యాణ్‌ కాన్వాయ్‌లు ప్రయాణించాయి. వాటితో పాటు భారీ సంఖ్యలో వాహనాలను వెళ్లినా వాటిని నియంత్రించకుండా వదిలేశారు.

దీంతో గూడవల్లి వంతెన వద్దకు చేరే సరికి జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. అప్పటికే మరో లేన్‌లో ప్రయాణించిన వారు వాహనాలను రోడ్లపై వదిలేసి కాలినడకన స్టెరైల్ మార్గంలో నడక ప్రారంభించారు. ఆ తర్వాత బయల్దేరిన గవర్నర్ కాన్వాయ్‌, కేంద్ర మంత్రులు వారి మధ్య చిక్కుకుపోయారు.

దీంతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక ఆలస్యం కావడం తో ప్రధాని మోదీ సమక్షం లో వేదిక వెనుక ఏర్పాటు చేసిన గ్రీన్ రూములో 11 గంటల 27 నిముషాలకు చంద్రబాబు సంతకం చేశారు. గవర్నర్ రాక కోసం 15 నిముషాల పాటు ప్రధాని మోదీ, చంద్రబాబు వేచి ఉన్నారు.

ముఖ్యమంత్రి, మంత్రుల తో ప్రమాణం చేయించాల్సిన గవర్నర్ వేదిక కు ఆలస్యం గా చేరుకోవడం పై ప్రధాని అరా తీశారు. అప్పటికి పలువురు కేంద్ర మంత్రులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.

మరోవైపు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వైఫల్యం వల్లే ఈ ఆలస్యం జరిగినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సరైన సమయానికి ఎయిర్‌ పోర్ట్‌కు కూడా గవర్నర్ చేరుకోలేకపోయారు.

ట్రాఫిక్‌లో చిక్కుకుని అటు విమానాశ్రయానికి, ఇటు వేదిక వద్దకు సకాలంలో చేరలేకపోయారు. గవర్నర్ కాన్వాయ్‌కు ట్రయల్ రన్ కూడా పోలీస్ యంత్రాంగం నిర్వహించలేదు. విజయవాడలో ట్రాఫిక్ నియంత్రణను ఉదయం నుంచి ట్రాఫిక్ నియంత్రణ ను పోలీసులు గాలికి వదిలేశారు.

ట్రాఫిక్‌లో చిక్కుకున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్త రెండు కిలోమీటర్లు కాలినడక నడవాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై ప్రాథమికంగా విచారణ జరిపిన అధికారులు బాధ్యుల్ని గుర్తించే పనిలో పడ్డారు. గవర్నర్ రావడంలో జరిగిన ఆలస్యం, ట్రాఫిక్ చిక్కుల పై తీవ్ర అసంతృప్తి , ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

WhatsApp channel

సంబంధిత కథనం