AP CM Chandrababu : సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు - మెగా డీఎస్సీపై తొలి సంతకం, మరో 4 ఫైళ్లపై కూడా..!-chandrababu took charge as ap cm first signed on mega dsc ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cm Chandrababu : సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు - మెగా డీఎస్సీపై తొలి సంతకం, మరో 4 ఫైళ్లపై కూడా..!

AP CM Chandrababu : సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు - మెగా డీఎస్సీపై తొలి సంతకం, మరో 4 ఫైళ్లపై కూడా..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 13, 2024 04:59 PM IST

AP CM Chandrababu Latest News: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలను స్వీకరించారు. మెగా డీఎస్పీపై తొలి సంతకం చేశారు.

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు

AP CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయగా… ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై రెండో సతకం చేశారు. పెన్షన్లు రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై 4వ సంతకం చేయగా… నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు.

గురువారం సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్ లోని తన ఛాంబర్లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ తో పాటు మరికొందరు ముఖ్య అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బాధ్యతల స్వీకరణ తర్వాత….16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ దస్త్రంపై చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ రెండో సంతకం చేశారు. పెన్షన్ల పెంపు దస్త్రంపై మూడో సంతకం చేశారు.

మళ్లీ ఐదేళ్ల తర్వాత….

ఐదేళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరోసారి వెలగపూడి సచివాలయంలో అడుగుపెట్టారు. సచివాయం మొదటి బ్లాక్‌లోని ఛాంబర్‌లో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత… ఇక్కడ్నుంచే చంద్రబాబు తన కార్యక్రమాలను కొనసాగించిన సంగతి తెలిసిందే.

ఇక ఇవాళ చంద్రబాబు తిరుమలతో పాటు విజయవాడలోని దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఉదయం తిరుమలలో పర్యటించిన సందర్భంగా మాట్లాడారు.  ఏపీలో తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నామని చెప్పారు. తిరుమలను ఐదేళ్లలో అపవిత్రం చేశారని, తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుందని, తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్పవేరే నినాదం ఉండకూడదన్నారు.

గత ఐదేళ్లలో తిరుమలను అధ్వాన్నంగా మార్చారని, బ్లాక్‍ లో టికెట్లు అమ్ముకున్నారని, తిరుమల కొండపైకి గంజాయి. నాన్‌వెజ్‌, మద్యంతో పాటు అన్యమత ప్రచారాలను కూడా అనుమతించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరస్వామిని ఊరూరా తిప్పారని, పెళ్లిళ్లు పేరంటానికి కూడా శ్రీవారిని తీసుకెళ్లారని, వెంకన్నకు ద్రోహం తలపెడితే ఈజన్మలోనే శిక్ష తప్పదని నిరూపితమైందన్నారు.

వెంకటేశ్వర స్వామి కులదైవమని, 2003లో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినపుడు క్లెమోర్ మైన్స్ పేలాయని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు తాను చనిపోతే ఆయనకు అపవాదు వచ్చేది. నా వల్ల రాష్ట్రానికి అవసరం ఉందని గుర్తించి స్వామివారు ప్రాణ భిక్ష పెట్టారని చెప్పారు. వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇకపై ఏమి చేయాలో ఆలోచిస్తున్నట్టు తెలిపారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని చంద్రబాబు చెప్పారు. తెలుగుజాతి అత్యున్నత స్థానంలో ఉండాలని కోరుకుంటానని…  టీటీడీతోనే రాష్ట్ర ప్రక్షాళన ప్రారంభం కావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164 సీట్లలో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేయగా 135 స్థానాల్లో నెగ్గింది. అతిపెద్ద భాగస్వామ్యపక్షంగా టీడీపీ ఉంది. ఇక జనసేన 21కి 21 స్థానాల్లో జెండా ఎగరవేసింది. భారతీయ జనతా పార్టీ మొత్తం 10 చోట్ల పోటీ చేయగా.. 8 సీట్లలో గెలుపొందిన సంగతి తెలిసిందే. 

 

WhatsApp channel