Chandrababu On CM Jagan : రైతుల కష్టాలు జగన్ రెడ్డికి పట్టవా..?
Chandrababu Visit Flood Affected Areas:ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని వ్యక్తి సీఎంగా ఉండటం ప్రజల దౌర్బాగ్యమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ రెడ్డికి అసలు రైతుల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు.విపత్తు సయమంలో రైతులకు ఇచ్చే పరిహారం తగ్గించటం సిగ్గుచేటు అన్నారు.

Chandrababu : వైసీపీ ప్రభుత్వం ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. శుక్రవారం తుపాన్ తో పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించారు. గుంటూరు జిల్లాలోని వేమూరునియోజకవర్గం అమర్తలూరులోని నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… తుఫాన్ తో పంట నష్టపోయి రైతులు కన్నీరు పెడుతుంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బాధ్యతరాహిత్యంగా వ్యవహరించటం సిగ్గుచేటని మండిపడ్డారు.
“తెనాలి నియోజకవర్గంలో వరి, అరటి, మినుము, పెసలు వంటి పంటలు దెబ్బతిన్నాయి. 30 వేల ఎకరాల్లో 80 శాతం పంట నష్టం జరిగింది. వేమూరు నియోజకవర్గంలో 90 వేల ఎకరాల్లో పంట సాగుచేస్తే 90 శాతం పంట నష్టపోయారు. వరి అంతా నేలకొరిగింది. ఎకరాకు రూ. 50 వేలు ఖర్చు చేశారు, ప్రతి రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇంత వరకు అధికారులు ఎవరైనా వచ్చారా? ముఖ్యమంత్రి భూమ్మీద తిరగకుండా ఆకాశంలో తిరుగుతున్నారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా? రైతులు ఎవరూ కోలుకునే పరిస్ధితి లేదు. టీడీపీ హయాంలో ఎప్పటికప్పుడు పంటకాలువల్లో పూడిక తీశాం. కానీ నేడు ఎక్కడైనా పంటకాలువల్లో పూడిక తీశారా? డ్రెయిన్స్ శుభ్రం చేశారా? మురుగునీరు పొలాల్లోకి వెళ్లి పొలాలు మునిగిపోతున్నాయి. జూలైలో మీరంతా నారు మళ్లు వేశారు, కానీ ప్రభుత్వం నీల్లివ్వకపోయిన కష్టపడి పంట నిలుపుకున్నారు చేతికొచ్చిన పంట తుఫాన్ దాటికి నేలపాలయ్యింది. జగన్ రెడ్డికి బంగాళ దుంపలకు, ఉల్లిగడ్డలకు తేడా తెలియదు. పొటాటో అంటే ఏంటని రైతుల్ని అడుగుతున్నారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా?” అని చంద్రబాబు నిలదీశారు.
విధ్వంసం నేటికీ కొనసాగుతూనే ఉంది - చంద్రబాబు
జగన్ రెడ్డికి తప్పుడు పనులు చేయటం తప్ప ఇంకేం తెలియదన్నారు చంద్రబాబు. “రేపల్లెలో లక్ష ఎకరాల్లో పంట సాగు చేస్తే 60 వేల ఎకరాల్లో నష్టం జరిగింది. బాపట్లలో 45 వేల ఎకరాలు సాగు చేస్తే 45 వేల ఎకరాలు నష్టపోయింది. ఒక్క ఈ ప్రాంతంలోనే ఇన్ని వేల ఎకరాల్లో నష్టం వాటిల్లిందంటే ఇక రాష్ట్రం మొత్తం ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లివుంటుంది? హధ్ హధ్ తుఫాన్ సమయంలో తుఫాన్ కంటే ముందుగా నేను విశాఖ వెళ్లి అక్కడి ఉండి పరిస్ధితులు చక్కదిద్దా. వైసీపీ మంత్రులు సాధికార యాత్ర అంటూ తిరుగుతున్నారు. వాళ్ల మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడప కూడా దాట లేదు. చేతకాని పాలనతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. నాలుగున్నరేళ్ల నుంచి పంట కాలువలు బాగుచెయ్యకుండా తవ్వకుండా ఏం చేస్తున్నారు? పంట కాలువలు తవ్వితే నేడు రైతులు నష్టపోయేవారా? నాలుగున్నరేళ్లలో ఒక్క రోడ్డు అయినా వేశారా? అన్ని వ్యవస్ధలు విచ్చిన్నం చేశారు. ప్రజా వేదికతో మొదలైన జగన్ రెడ్డి విధ్వంసం నేటికీ కొనసాగుతూనే ఉంది. మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారు. జగన్ రెడ్డి అందర్నీ తన కోసం పనిచేసే బానిసలు అనుకుంటున్నారు. అంత అహంకారం ప్రజాస్వామ్యంలో పనికొస్తుందా? నాలుగున్నరేళ్లలో ప్రజలకు ఈయన చేసిందేంటి? ఫసల్ భీమాను నిర్వీర్యం చేశారు. ప్రతి సంవత్సరం భీమా ఇస్తున్నామంటున్నారు. మీలో ఎవరికైనా ఆ డబ్బులు వచ్చాయా? విపత్తులు వచ్చినపుడే ప్రభుత్వ పనితనం బయటపడుతుంది. మిచౌంగ్ తుఫాన్ తో వైసీపీ చేతకాని తనం బయటపడింది. తుఫాన్ వస్తుందని తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు” అని చంద్రబాబు విమర్శించారు.
టీడీపీ హయాంలో వరికి నష్టపరిహారం హెక్టారుకు రూ. 20 వేలిస్తే నేడు రూ. 15 వేలకు తగ్గించారని ఆరోపించారు చంద్రబాబు. “ఎరువు ధరలు, ట్రాక్టర్ ఖర్చులు పెరిగాయి. హెక్టారుకు రూ. 30 నుంచి రూ. 40 వేలివ్వాలి. ఈ ముఖ్యమంత్రి ఇవ్వకపోతే మరో 3 నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుంది. నష్టపోయిన వారందరినీ ఆదుకుంటాం. ప్రజల్లో చైతన్యం రావాలి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. టీడీపీ హయాంలో ఆక్వా కల్చర్ కి రూ. 30 వేలు ఇస్తే దాన్ని రూ. 8200 తగ్గించారు. కనీసం రూ. 50 వేలివ్వాలి. నాడు చనిపోయిన వారికి మేం ఇచ్చిన రూ. 5 లక్షలే ఇస్తున్నారు. మేం ఉంటే రూ. 10 లక్షలు ఇచ్చే వాళ్లం. గాయపడిన వారికి రూ. 1 లక్ష ఇచ్చాం, కానీ వీళ్లు రూ. 12,500 ఇస్తున్నారు. దాన్ని రూ. 2 లక్షలకు పెంచాలి. ఇల్లు కూలిపోతే రూ. 4 లక్షలతో కొత్త ఇళ్లు కట్టించాం. కానీ నేడు రూ. 1 లక్షా 80 వేలిచ్చి చేతులు దులుపుకున్నారు. రూ. 1 లక్ష ఇచ్చి ఉచితంగా ఇల్లు కట్టించాలి. దెబ్బతిన్న ఇళ్లకు నాడు రూ. 10 వేలిస్తే నేడు రూ. 5200 తగ్గించారు. దాన్ని రూ. 20 వేలకు పెంచాలి” అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
నేడు జగన్ రెడ్డి బాధితులకు 25 కేజీల బియ్యం ఇచ్చామంటున్నారు. ఆ 25 కేజీల బియ్యంతో జీవితాలు బాగుపడతాయా? అని ప్రశ్నించారు చంద్రబాబు." టీడీపీ హయాంలో నేత కార్మికులు, మత్స్య కార్మికులకు 50 కేజీల బియ్యం ఇవ్వటంతో పాటు ఖర్చులకు రూ. 5 వేలిచ్చాం. కానీ నేడు రూ. 2,500 ఇస్తారంట. వైసీపీ ప్రభుత్వం పేదల్ని అన్ని విధాల ఇబ్బందులకు గురి చేస్తోంది. నాకు భాద, ఆవేదన ఉంది కానీ తిట్టాలంటే మనసు రావటం లేదు. ఎన్ని సార్లు చెప్పినా జగన్ రెడ్డికి అర్దం కాదు. తుఫాన్ వచ్చి ఇన్నిరోజులయ్యింది ప్రభుత్వం నుంచి మీకేమైనా సాయం అందిందా? ప్రభుత్వానికి బాధ్యత లేదా?" అని ప్రశ్నించారు.