Chandrababu Quash Petition : చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
Chandrababu Quash Petition : స్కిల్ కేసులో హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
Chandrababu Quash Petition : స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం రెండు రోజుల తర్వాత తీర్పు వెల్లడించనున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 వరకు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి, రంజిత్ రెడ్డి, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున సిద్థార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఈ సెక్షన్ వర్తిస్తుందని చంద్రబాబు న్యాయవాది హరీశ్ సాల్వే వాదించారు. ఈ కేసులో వాదనలు విన్న కోర్టు... తీర్పును రిజర్వ్ చేసింది.
ట్రెండింగ్ వార్తలు
సెక్షన్ 17ఏ పై వాదనలు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ పూర్తైంది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో పలు అంశాలను ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబును అరెస్ట్ చేసే సమయానికి ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు లేదని కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ తేజ్‌మాల్ చౌదరి, అర్ణబ్ గోస్వామి కేసులను సాల్వే హైకోర్టులో ప్రస్తావించారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌పై గతంలో జరిగిన దర్యాప్తుపై మెమో మాత్రమే వేశారన్నారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ కింద తగిన అనుమతులు తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. చంద్రబాబుపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ చట్టవిరుద్ధమైనదని వాదించారు. గతంలో వచ్చిన తీర్పులను అడ్వకేట్ జనరల్ తప్పుగా అన్వయించారన్నారు. సెక్షన్ 17ఏ పూర్తి వివరాలు తెలిసి ఉండీ తప్పనిసరి అనుమతులు తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. కేసు పెట్టేందుకు మూలమైన సమయం దృష్టిలో పెట్టుకొని సెక్షన్ 17ఏ వర్తిస్తుందన్నారు. మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కూడా చంద్రబాబు తరఫున హైకోర్టులో వాదనలు వినిపించారు.
బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ వాయిదా వేసింది. చంద్రబాబు కస్టడీ పిటిషన్ సహా బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ పిటిషన్లపై విచారణ వాయిదా వేసినట్లు ఏసీబీ కోర్టు తెలిపింది.