CBN In Eluru: వైసీపీ పాపాలు, ప్రజలకు శాపాలుగా మారాయన్న చంద్రబాబు, 17లోగా వరద బాధితులకు పరిహారం చెల్లింపు
CBN In Eluru: వైసీపీ పాపాలు శాపాలుగా మారాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. ఐదేళ్లలో వ్యవస్థలు భ్రష్టపట్టడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. ఏలూరులో కొల్లేరు, తమ్మిలేరు, రామిలేరు కాల్వల వరదలపై సమీక్ష నిర్వహించారు. వరద బాధితులకు ఈ నెల 17లొోగా పరిహారం అందిస్తామన్నారు.
CBN In Eluru: ఎన్నికల్లో ఓడించినందుకు ప్రజల మీద ద్వేషం పెంచుకుని, ప్రజలకు ఏదో రకంగా నష్టం చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నారని సిఎం చంద్రబాబు ఆరోపించారు. ఏలూరులో కొల్లేరు, తమ్మిలేరు, రామిలేరు వరద నష్టంపై సమీక్షించిన చంద్రబాబు వైసీపీ అధ్యక్షుడిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వంటి రాజకీయ పార్టీ దేశంలో ఇంకోటి ఉండదన్నారు. ప్రజలంతా వైసీపీ చేస్తున్న రాజకీయాలు అర్థం చేసుకోవాలన్నారు.
ప్రకాశం బ్యారేజీని డీకొట్టినవి దొంగ ఇసుక వ్యాపారం చేయడానికి వినియోగించిన బోట్లని చంద్రబాబు ఆరోపించారు. నేరాలు ఘోరాలు చేసే వారు క్రిమినల్ మైండ్‌తో బ్యారేజీకి నష్టం చేయాలని చూశారని మండిపడ్డారు. బుడమేరు వరద ఉధృతికి ఎన్‌డిఆర్‌ఎఫ్ వంటి సంస్థలు ముందుకు వెళ్లలేని పరిస్థితులు వచ్చాయన్నారు. గండ్లను పూడ్చడానికి ఆర్మీ కూడా చేతులెత్తేస్తే మంత్రి నిమ్మల రామానాయుడు ఐదు రోజులు గట్ల మీదే ఉంటూ శ్రమించారన్నారు. ఎన్ని ఆవాంతరాలు వచ్చిన వెనకడుగు వేయకుండా గండ్లను పూడ్చి విజయవాడను కాపాడారని చెప్పారు.
గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని, ఆ కేసులో అరెస్టులు చేస్తే దాని మీద కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారని, తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఓ రాజకీయ పార్టీ మరో పార్టీ కార్యాలయంపై దాడి చేయడం చూడలేదని, అలాంటి దురదృష్టకరమైన పరిస్థితులు ఎదురయ్యాయని, నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
అందుకే పర్యటనలు..
తాను బురదలోకి దిగకపోతే ఆఫీసర్లు పనిలోకి దిగడం లేదని, తాను వరద నీటిలోకి దిగడంతో ఐఏఎస్ అధికారులు కూడా వరదల్లో కిందకు దిగి పనిచేశారన్నారు. కలెక్టర్లు, ఆఫీసర్లు ప్రజలంతా అభినందించేలా పనిచేశారన్నారు. వరదలు వస్తే గత ఐదేళ్లలో ఎప్పుడైనా పాలకులు వచ్చారా అని ప్రశ్నించారు. ఎప్పుడూ పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి, తన వల్ల బురదలోకి వచ్చి పరామర్శించి మళ్లీ పారిపోయాడన్నారు.
ప్రజల్లో కష్టాల్లో ఉన్నపుడు వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తిత్లీ తుఫాను వచ్చినపుడు ఎకరాకు రూ.20వేలు ఇచ్చానని, వైసీపీ పాలనలో దానిని రూ.16వేలు చేశారని, అధికారం దిగిపోయే ముందు రూ.17వేలు చేశారని, వరిపంట చేతికి రావడానికి 80 రోజుల సమయం పడుతుందని అందుకే పరిహారం పెంచుతున్నట్టు ప్రకటించారు.
హెక్టారుకు రూ.25వేలు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. అంతకు మించి ఇవ్వాలని ఉన్నా తన వద్ద ఆదాయం లేదని చంద్రబాబు చెప్పారు. పదిలక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కట్టాలని,ప్రజలంతా కలిసి కట్టుగా ఎన్డీఏ కూటమికి బ్రహ్మరథం పట్టారని, 93శాతం ఓట్లతో అభ్యర్థిని గెలిపించి మంచి చేశారన్నారు. వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రానికి ప్రజలే ఆక్సిజన్ ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కూడా సహకరిస్తుందన్నారు.
17లోగా పరిహారం చెల్లింపు…
ఈ నెల 17వ తేదీలోపు వ్యవసాయం, పశువులు, హార్టికల్చర్ నష్టాలను భర్తీ చేస్తామన్నారు. వరికి ఎకరాకు రూ.10వేలు పరిహారం చెల్లిస్తామని చెప్పారు. తమ్మిలేరు, ఎర్రకాల్వ ఏలూరు జిల్లాకు ఎప్పుడు నష్టం కలిగిస్తున్నాయని, ఉప్పుటేరుకురెగ్యులేటర్ నిర్మాణం విషయంలో సీరియస్‌గా పరిష్కారం ఆలోచిస్తామన్నారు. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు దానిని పరిష్కరిస్తామని చంద్రబాబు చెప్పారు.