Electricty Bills: ముంపు ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపుకు నెల రోజుల గడువునిస్తామన్న చంద్రబాబు
Electricty Bills: విజయవాడతో పాటు కృష్ణా, బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులు, బకాయిల వసూలు నెల రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వరద నష్టంపై రేపు సాయంత్రానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందిస్తామన్నారు.
Electricty Bills: విజయవాడతో పాటు కృష్ణా, బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులు, బకాయిల వసూలు నెల రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వరద నష్టంపై రేపు సాయంత్రానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందిస్తామన్నారు.
ముంపు ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులు, బకాయిల వసూలు ఒక నెల వాయిదా వేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గురువారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చారని, వరదలపై విశ్లేషణ చేశారన్నారు. వరద నష్టంపై తక్షణ సాయంగా కేంద్రానికి రేపు సాయంత్రం ప్రాథమిక నివేదిక పంపిస్తామన్నారు. అనంతరం సమగ్ర నివేదిక పంపిస్తామని పేర్కొన్నారు.
15లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా…
వరదల వల్ల భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 15 లక్షల క్యూసెక్కుల నీరు డిశ్చార్జ్ చేయడానికి వీలుగా ప్రకాశం బ్యారేజీని బలోపేతం చేస్తున్నామన్నారు. వరద పరిస్థితి నుంచి సాధారణ పరిస్థితికి తీసుకువచ్చేందుకు తాము ప్రయత్నిస్తుంటే ఈ విపత్కర పరిస్థితుల్లో కొందరు అనవసర రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందాలనుకోవడం సరికాదన్నారు.
వరదల వల్ల కలిగిన నష్టానికి గత ప్రభుత్వమే కారణమన్నారు. గతంలో తాను బుడమేరు కాల్వ అభివృద్ధికి సంబంధించి గండ్లు పూడ్చాలని రూ.57 కోట్ల నిధులు విడుదల చేస్తే గత ప్రభుత్వం ఆ అంశాన్ని పక్కకు పెట్టిందన్నారు. గత ప్రభుత్వం ఆనాడు గండ్లు పూడ్చి ఉంటే ప్రస్తుతం ఇబ్బంది ఉండేది కాదన్నారు. విజయవాడలోని భవానీపురం వద్ద రోడ్డుపైకి నీరు రావడాన్ని ఎవరూ ఊహించలేదన్నారు.
గత ప్రభుత్వ తప్పిదాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల లక్షలాది మంది ప్రజలు మానసిక క్షోభను అనుభవిస్తున్నారన్నారు. బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అగ్నిమాపక యంత్రాలతో పారిశుధ్య పనులు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా పారిశుద్ధ్యం, వైద్య, ఆరోగ్యంపై దృష్టి సారించిందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్ధ్య పనులను త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఆదేశించానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.ఇతర రాష్ట్రాల నుండి అగ్నిమాపక యంత్రాలను తీసుకువచ్చి త్వరితగతిన శుభ్రం చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తామన్నారు. వీలైనంత త్వరగా పారిశుద్ధ్య ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.బ్లీచింగ్ చేస్తామన్నారు.
మంచినీటి సరఫరా…
206 నీళ్ల ట్యాంకులతో ద్వారా 513 ట్రిప్పులు త్రాగునీరు పంపిణీ చేశామన్నారు. 5000 ఇళ్లను శుభ్రం చేశామన్నారు. అవసరమైతే క్లీన్ చేసే యంత్రాలను మరో 300 - 400 కొని ఇళ్లను శుభ్రం చేసే బాధ్యతను తీసుకుంటామన్నారు. నీళ్ల కుళాయిలను సైతం పునరుద్దరించామన్నారు. మరో రెండు రోజులు ఎవరూ కుళాయిల ద్వారా వచ్చే నీటితో వంటలు గానీ, త్రాగడం చేయవద్దని సూచించారు. స్నానాలు, ఇళ్లు శుభ్రం చేసుకునేందుకు మాత్రమే వినియోగించాలని తెలిపారు.
పంపులు మరమ్మతులు చేశాక నీటిని వినియోగించాలని కోరారు. దోమలను నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. మరిన్ని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఇంటికీ మెడికల్ కిట్ లు అందిస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రజలు ఏం చేయాలి ? ఏం చేయకూడదు అన్న అంశాలపై అవగాహన కల్పించేలా 5 లక్షల కరపత్రాలు రూపొందించి పంపిణీ చేశామన్నారు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ..
వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో మినహా చాలా ప్రాంతాల్లో యుద్దప్రాతిపదికన విద్యుత్ ను పునరుద్ధరించామన్నారు. 21 సెల్ ఫోన్ టవర్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.. విద్యుత్ పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నా కొన్ని చోట్ల నీరు తగ్గితేనే సరఫరా సాధ్యమవుతుందన్నారు.