CBN Instructions: ఏపీలో విఐపి ప్రోటోకాల్ పేరుతో సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టే సంస్కృతికి ముగింపు పలకాలని చంద్రబాబు పోలీసుల్ని ఆదేశించారు. గురువారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వెళ్తున్న క్రమంలో సాధారణ ప్రజల వాహనాలను నిలిపి వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడటాన్ని గుర్తించారు.
కరకట్ట మీదుగా, కాన్వాయ్ వెళ్తున్న ప్రాంతంలో ఇకపై ట్రాఫిక్ ఆపొద్దని భద్రతా సిబ్బందికి చంద్రబాబు సూచించారు. వీఐపీ సెక్యూరిటీ పేరుతో కాన్వాయ్ వెళ్లే దారిలో గంటల తరబడి వాహనాలు నిలిపేసే విధానాలకు స్వస్తి పలకాలని చంద్రబాబు ఆదేశించారు.
తక్షణమే సంబంధిత పోలీస్ అధికారులకు ఈ మేరకు సమాచారం ఇవ్వాలని తన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్లి నివాసం నుండి ఎయిర్ పోర్టుకు వెళ్లేలోపు గుంటూరు ఎస్పీ, విజయవాడ సీపీలకు చంద్రబాబు భద్రతా సిబ్బంది సమాచారం ఇచ్చారు.
ఏదైనా పాయింట్ దాటే సమయంలో కాన్వాయ్ సమీప ప్రాంతానికి వచ్చినప్పుడు అతి తక్కువ సమయం మాత్రమే సామాన్య ప్రజల వాహనాలు నియంత్రించి వాహనదారులు ఇబ్బంది పడకుండా చూడాలని చంద్రబాబు ఆదేశాలను పోలీస్ ఉన్నతాధికారులకు సీఎస్ఓ అందించారు.
భవిష్యత్తులో కూడా చంద్రబాబు పర్యటనల్లో సామాన్య ప్రజలకు, వాహన దారులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చంద్రబాబు సూచించారు. భద్రతా చర్యలు పాటిస్తూనే సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా తన రాకపోకలు ఉండేలా చూడాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
బారికేడ్లు పెట్టడం, పరదాలు కట్టడం, రోడ్లు మూసివేయడం, షాపుల బంద్ వంటి పోకడలకు ఇక స్వస్థి చెప్పాలని చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.
ఎన్డీఏ సమావేశానికి బయలుదేరిన చంద్రబాబు ఉండవల్లి నుంచి విజయవాడ మీదుగా ఎయిర్ పోర్ట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయడాన్ని గుర్తించారు. ఇకపై వాటిని నియంత్రించాలని అధికారులకు స్పష్టం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. శుక్రవారం జరిగే ఎన్డీఏ పక్షాల పార్లమెంట్ సభ్యుల సమావేశంలో పాల్గొననున్నారు. 9వ తేదీన మోదీ ప్రమాణస్వీకారం ఉండటంతో ఢిల్లీలోనే చంద్రబాబు రెండు మూడు రోజులు బస చేయనున్నట్టు తెలుస్తోంది.
గత ఐదేళ్లలో వైసీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ మాత్రం పని చేయలేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కొత్తగా ఎన్నికైన ఎంపీలతో అభిప్రాయపడ్డారు. జగన్ కేసుల మాఫీ కోసమే ఢిల్లీలో పైరవీలు చేశారని చెప్పారు. ఉండవల్లిలోని నివాసంలో గురువారం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీకి అందుబాటులో ఉన్న తొమ్మిది మంది సభ్యులు సమావేశానికి హాజరుయ్యారు. మిగిలిన వారు జూమ్‌లో హాజరయ్యారు.
ప్రజలు అందించిన అసాధారణ విజయంతో ఎవరూ ఆకాశంలో ఎగరొద్దని, ప్రజలు నమ్మకం ఉంచి ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవకు వినియోగించాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలని, వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా, ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుందన్నారు. పదవులు శాశ్వతమని ఎవరూ అనుకోవద్దని ఎంపీలకు స్పష్టం చేశారు.
ఇకపై రాష్ట్రంలో అధికారుల పెత్తనం ఉండదని, మారిన చంద్రబాబును అంతా చూస్తారని చెప్పారు. పాలనలో అధికారుల పెత్తనం ఉండదని స్పష్టం చేశారు. తాను మారనన్న అభిప్రాయం చాలామందిలో ఉందని, ఇకపై అలా జరగదని భరోసా ఇచ్చారు. దానిని ప్రత్యక్షంగా చూస్తారన్నారు.
ఎంపీలు తరచూ తనను కలవాలని, తీరిక లేకపోయినా వారికి సమయం కేటాయించి మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఐదేళ్లూ పార్టీ నాయకులు, కార్యకర్తలూ ప్రాణాలిచ్చారని మెడపై కత్తిపెట్టినా... వెనక్కి తగ్గలేదన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు ఎవరూ తలొగ్గలేదని ఇకపై ప్రతి అంశాన్నీ తాను వింటానని, తానే స్వయంగా చూస్తానన్నారు. ఇకపై రాజకీయ పరిపాలన చూపిస్తానన్నారు. గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి పనిచేయాలని సూచించారు.
ఐదేళ్లలో పార్టీ కోసం నేతలు, కార్యకర్తలు పడిన ఇబ్బందులు తనకు చాలా వేదన కలిగించాయని.. వారి త్యాగం, కృషి వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కార్యకర్తలను నాయకులు గౌరవించాలని ఐదేళ్లపాటు అనేక సవాళ్లు, సమస్యలు ఎదుర్కొని కార్యకర్తలే పార్టీని నిలబెట్టారని వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 12న జరిగే ప్రమాణ స్వీకారానికి మోదీ వస్తారని చంద్రబాబు ఎంపీలకు వివరించారు.