CBN in Chennai : ప్రపంచమంతా ఇండియా వైపు చూస్తోంది.. భవిష్యత్ భారతీయులదే : చంద్రబాబు-chandrababu naidu speech at the all india research scholars summit 2025 held in chennai ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn In Chennai : ప్రపంచమంతా ఇండియా వైపు చూస్తోంది.. భవిష్యత్ భారతీయులదే : చంద్రబాబు

CBN in Chennai : ప్రపంచమంతా ఇండియా వైపు చూస్తోంది.. భవిష్యత్ భారతీయులదే : చంద్రబాబు

CBN in Chennai : ప్రపంచమంతా ఇప్పుడు ఇండియా వైపు చూస్తోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇకపై భవిష్యత్ అంతా భారతీయులదే అని అభిప్రాయపడ్డారు. మద్రాస్‌ ఐఐటీలో నిర్వహించిన ఆల్‌ ఇండియా రీసెర్చ్‌ స్కాలర్స్‌ సమ్మిట్‌ 2025.. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు.

చంద్రబాబు

ఐ యాం ప్రౌడ్ టు బి యాన్ ఇండియన్.. అలాగే తెలుగు వాడిగా గర్వపడుతున్నా.. అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా ఇప్పుడు ఇండియా వైపు చూస్తోందని.. ఇకపై భవిష్యత్ అంతా భారతీయులదే అని ఆశాభావం వ్యక్తం చేశారు. మద్రాస్ ఐఐటీలో దాదాపు 25 నుంచి 30 శాతం తెలుగు విద్యార్థులే ఉన్నారన్న చంద్రబాబు.. ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశాయని వివరించారు.

ఎక్కడికెళ్లినా తెలుగు వారే..

'ఎక్కడికెళ్లినా మన తెలుగు వారే ఉన్నారు. ఏ దేశం వెళ్లినా మన వాళ్లే ఉన్నారు. 1995లో ఐటీ గురించి మాట్లాడా.. 2025లో ఏఐ గురించి మాట్లాడుతున్నా. ఆ రోజు హైటెక్ సిటీ కట్టా. ఇప్పుడు క్వాంటం వ్యాలీ డెవలప్ చేస్తున్నాం. 1999లో పవర్ సెక్టార్ రిఫార్మ్స్ తీసుకొచ్చా. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. గ్రీన్ హైడ్రోజెన్ రంగంలో ఇప్పటికే అనేక పెట్టుబడులు వచ్చాయి. విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకొస్తున్నాం. కరిక్యులం మార్పు, న్యూ టెక్నాలజీస్ నుంచి, "ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్" వరకు ప్రయత్నాలు చేస్తున్నాం' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఐఐటీ మద్రాస్ సూపర్..

'మద్రాస్‌ ఐఐటీ ఎన్నో విషయాల్లో నంబర్‌ వన్‌గా ఉంది. ఆన్‌లైన్‌ కోర్సులు కూడా అందిస్తోంది. ఐఐటీ మద్రాస్‌ స్టార్టప్‌ అగ్నికుల్‌ మంచి విజయాలు అందుకుంది. ఇక్కడి స్టార్టప్‌లు 80 శాతం విజయవంతమవుతున్నాయి. ఐఐటీల స్థాపన దేశ విద్యారంగంలో గొప్ప ముందడుగు. రాజకీయ సంస్కరణలతో సోవియట్‌ రష్యా అనేక దేశాలుగా విడిపోయింది. అదే సమయంలో చైనా ఆర్థిక సంస్కరణలు ప్రారంభించింది. ఆ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆ దేశం ఎదిగింది' అని చంద్రబాబు వివరించారు.

బిల్‌గేట్స్ ఒప్పుకోలేదు..

'భారత్‌ కూడా సంస్కరణల తర్వాత అభివృద్ధి దిశగా పయనిస్తోంది. బ్రిటిష్‌వారు మన దేశం నుంచి అంతా తీసుకెళ్లారు.. ఒక్క ఇంగ్లీష్‌ను మనకు వదిలేశారు. 1990లలో కమ్యూనికేషన్‌ రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్‌, వీఎస్‌ఎన్‌ఎల్‌ గుత్తాధిపత్యం ఉండేది. ఆర్థిక సంస్కరణల తర్వాత కమ్యూనికేషన్ల రంగంలో ప్రైవేటు సంస్థల రాక ఓ గేమ్‌ ఛేంజర్‌. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను మొదట కలుస్తానని అడిగినప్పుడు రాజకీయ నేతలతో సంబంధం లేదని చెప్పారు. ఆయన్ను ఒప్పించి అపాయింట్‌మెంట్‌ తీసుకున్నా. 45 నిమిషాలు మాట్లాడారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ సంస్థ నెలకొల్పాలని కోరాను. ఇప్పుడు అదే సంస్థకు సీఈవోగా తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల ఉన్నారు' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

జనాభా మనకు బలం..

'కొంతకాలంగా భారత్‌ వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటోంది. 2014లో మనది పదో ఆర్థిక వ్యవస్థ.. ఇప్పుడు ఐదో స్థానానికి చేరింది. భారత్‌కు ఉన్న గొప్పవరం జనాభా. డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌. మనమంతా కృషి చేస్తే.. త్వరలోనే ప్రపంచంలో భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంటుంది. చాలా దేశాలు జనాభా తగ్గుదల సమస్యను ఎదుర్కొంటున్నాయి. మన దేశానికి మరో 40 ఏళ్ల వరకూ ఆ సమస్య లేదు. జనాభా తక్కువగా ఉన్న దేశాలు గతంలో అభివృద్ధి చెందాయి. ఇప్పుడు సమస్యను ఎదుర్కొంటున్నాయి' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.