Chandrababu Comments: మీరు గెలిపించకపోతే.. ఇదే నాకు చివరి ఎన్నికలు!-chandrababu naidu sensational comments on his political carrer ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Chandrababu Naidu Sensational Comments On His Political Carrer

Chandrababu Comments: మీరు గెలిపించకపోతే.. ఇదే నాకు చివరి ఎన్నికలు!

HT Telugu Desk HT Telugu
Nov 17, 2022 08:07 AM IST

chandrababu sensational comments: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఈ సారి గెలిపించకుంటే ఇవే తన చివరి ఎన్నికలు అవుతాయని కర్నూలులో అన్నారు.

కర్నూలులో చంద్రబాబు
కర్నూలులో చంద్రబాబు (twitter)

chandrababu sensational comments on elections: కర్నూలు జిల్లాలోని మూడు రోజుల పర్యటనలో భాగంగా.. తొలి రోజు పత్తికొండ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని.. టీడీపీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఈ సారి గెలిపించకుంటే ఇవే తన చివరి ఎన్నికలు అవుతాయని వ్యాఖ్యానించటం హాట్ టాపిక్ గా మారింది. ప్రజలు మళ్లీ తనను ఆశీర్వదించాలని కోరారు.

ట్రెండింగ్ వార్తలు

జగన్‌ సర్కార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేశారన్నారు. పేదలను ఆర్థిక కష్టాల్లో నెట్టేశారని.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారని అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకున్నామని వాపోయారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, పత్రికల్లో వార్తలు రాసినా దాడులు చేస్తున్నారని ఆక్షేపించారు. కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దావూద్‌ జగన్‌ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైందన్నారు.

ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ గౌరవ సభ కాదు కౌరవ సభని.. మళ్లీ సీఎం అయిన తరువాతే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశానని గుర్తు చేశారు చంద్రబాబు. అందుకే మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభగా మారుస్తాను అని.. దానికి ప్రజల సహకారం కావాలి వ్యాఖ్యానించారు. మీరంతా తనను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే సరి.. లేదంటే లేదంటే ఇదే నాకు చివరి ఎన్నిక అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

టీడీపీ వస్తే సంక్షేమం ఉండదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని,,. తానొస్తే పథకాలు కట్‌ చేయనని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి చేస్తామని.. అప్పులు చేయమన్నారు. సంపదను పెంచి పేదలకు పంచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. దేశంలో చెత్తపై పన్ను వేసిన ఏకైక సీఎం జగన్‌ అని దుయ్యబట్టారు. జగన్‌ గొప్పగా చెబుతున్న నవరత్నాలు నవమోసాలని విమర్శించారు.

మరోవైపు కర్నూలు వచ్చిన చంద్రబాబుకు పెద్దఎత్తున ప్రజలు స్వాగతం పలికారు. ఓర్వకల్లు, కోడుమూరు, కల్లూరు, దేవనకొండ మండలాల్లో పల్లెపల్లెనా ప్రజలు భారీగా తరలివచ్చారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రత్తికొండకు చేరుకోగానే తీవ్ర ఉద్రిక్తత కనిపించింది. ఆయన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు కొందరు. చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్న స్థానికులు కొందరు.. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. రాయలసీమ అన్యాయం చేసిన చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. హైకోర్టును అడ్డుకుంటున్న ద్రోహి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పోలీసుల రంగ ప్రవేశంతో... పరిస్థితి అదుపులోకి వచ్చింది.

మరోవైపు చివరి ఎన్నికలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నిజంగానే చంద్రబాబు రాజకీయాలకు గుడ్ బై చెబుతారా అన్న చర్చ మొదలైంది.

IPL_Entry_Point