AP Free Gas Cylinder : మహిళ ఇంటికెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించిన చంద్రబాబు.. స్వయంగా గ్యాస్ వెలిగించి..
AP Free Gas Cylinder : ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకం ప్రారంభం అయ్యింది. సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో జెండా ఊపి ఈ పథకాన్ని ప్రారంభించారు. స్వయంగా ఓ మహిళ ఇంటికి వెళ్లి సిలిండర్ అందజేశారు. పథకాం ప్రారంభం కావడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. జెండా ఊపి గ్యాస్ పంపిణీ చేసే వాహనాలను ప్రారంభించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గ్యాస్ సిలిండర్ అందజేశారు. లబ్ధిదారు శాంతమ్మ నివాసంలో గ్యాస్ వెలిగించి.. స్వయంగా టీ పెట్టారు. అనంతరం శాంతమ్మ కుటుంబ సభ్యులతో కలిసి టీ తాగారు.
అనంతరం ఈదుపురంలోని బడేపల్లిలో ఒంటరి మహిళ జానకికి పెన్షన్ అందజేశారు. ఒంటరి మహిళ జానకి ఇంటికెళ్లి పెన్షన్ అందజేసి.. కుటుంబం బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారు ఇల్లు కావాలని అడగడంతో.. వెంటనే ఇల్లు కట్టి ఇవ్వాలని అధికారులని ఆదేశించారు. ఈదుపురం నుంచి దీపం 2.0 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారంచుట్టడం ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 'గత పాలకులు లాగా మన మీటింగ్‌లలో ఆర్భాటాలు ఉండవు.. బలవంతంగా తీసుకు రావటం ఉండదు.. ప్రజల గుండెల్లో స్థానం ఉండాలి, అది చాలు' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఏలూరు జిల్లా.. ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్. జగన్నాధపురం గ్రామంలో దీపం-2 పథకాన్ని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా పవన్ కీలక కామెంట్స్ చేశారు. 'దీపం-2 పథకం ద్వారా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. అర్హులైన 1,08,39,200 మందికి (ఎల్పీజీ కనెక్షన్లకు) ఈ దీపం-2 పథకం వర్తిస్తుంది' అని పవన్ కళ్యాణ్ వివరించారు.
'ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.2684 కోట్లు ఖర్చు చేస్తుంది, 5 సంవత్సరాలకు రూ.13,425 కోట్లు ఖర్చు చేయబోతోంది. గత ప్రభుత్వం సంక్షేమం తమకంటే ఎవరూ బాగా చేయలేరు అన్నారు. వారికంటే బాగా చేసి చూపిస్తున్నాం. డబ్బు దోచుకోడం తప్పా ఇచ్చే మనసు లేని వారు వైసీపీ నాయకులు. మనకి దోచుకునే అవసరం లేదు, జేబులోంచి డబ్బులు తీసి ప్రజలకు ఇచ్చే మనస్తత్వం మన నాయకులది' అని పవన్ వ్యాఖ్యానించారు.
'రాష్ట్రవ్యాప్తంగా 64,14,000 మందికి పెన్షన్ అందిస్తున్నాం. రూ.2,710 కోట్లు ఒక్క నెలకే ఖర్చు పెడుతున్నాం. ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అపారమైన పరిపాలనా అనుభవం ఉండబట్టే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి' అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.